Begin typing your search above and press return to search.

తాజా మాటతో ఏపీకి కేటీఆర్ దెబ్బేశారా?

By:  Tupaki Desk   |   9 Sep 2016 5:15 AM GMT
తాజా మాటతో ఏపీకి కేటీఆర్ దెబ్బేశారా?
X
అత్త తిట్టిన దాని కంటే తోడికోడలు నవ్విన దానికే ఫీల్ కావటం కనిపిస్తుంది. సామెతగా చూసినప్పుడు సాదాసీదాగా కనిపించినా.. ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం దాని తీవ్రత ఎంత ఎక్కువన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీకి ఏదో చేస్తామంటూ ఊరించి.. ఊరించిన కేంద్రం పెద్దగా ప్రయోజనం లేని ప్యాకేజీని ప్రకటించి సీమాంధ్రులకు భారీ షాక్ ఇవ్వటం తెలిసిందే. జైట్లీ వెల్లడించిన ప్యాకేజీపై సీమాంధ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ తీరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

విభజన కారణంగా ఏపీ నష్టపోయిన దానితో పోలిస్తే.. విభజన హామీలు కావొచ్చు.. తాజాగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలేవీ జరిగిన నష్టం ముందు చాలా చిన్నవన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించటమేకాదు.. ఆ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీలు తరచూ మాట్లాడటం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు సైతం ఇదే రీతిలో రియాక్ట్ కావటమే కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావించటం కనిపిస్తుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన పక్షంలో ఇతర రాష్ట్రాలతో తలనొప్పులు స్టార్ట్ అవుతాయన్న మాటల్లో అర్థం లేదనే చెప్పాలి. దీనికి ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని మిగిలిన రాష్ట్రాలు ఎంతోకొంత గుర్తించినా.. విభజనకు మూలమైన తెలంగాణ రాష్ట్ర సర్కారు స్పందన అంతంతమాత్రంగా ఉండటం గమనార్హం. హోదాకు అనుకూలంగా మాట్లాడకున్నా ఫర్లేదు కానీ.. కేంద్రం సాయం చేయాలంటేనే ఆలోచించుకునేలా తెలంగాణ అధికారపక్ష నేతలు చేసే వ్యాఖ్యలు ఏపీకి ఇబ్బందికరంగా మారాయని చెప్పక తప్పదు.

హోదాను ప్రకటించాల్సిన దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అంటూ జైట్లీ ప్రకటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. తాజాగా ఆర్థికమంత్రి జైట్లీని కలిసి తమకూ ప్యాకేజీ ఇవ్వాలని కోరటంపై పలువురు సీమాంధ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క తమకు నెరవేర్చాల్సిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించక.. ఎంగిలి మెతుకులు విసిరినట్లుగా తూతూమంత్రంగా హామీలు ఇస్తున్న వేళ.. వాటికే రియాక్ట్ అయిపోయి.. తమకూ ప్యాకేజీ ఇవ్వాలంటూ తెలంగాణ సర్కారు తరఫున కేటీఆర్ కోరటం ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీయటం ఖాయమంటున్నారు.

అదెలానంటే.. ఏపీకి ఇచ్చే సాయం కారణంగా మిగిలిన రాష్ట్రాలు పోలిక పెట్టుకుంటాయని.. కేంద్రం మీద ఒత్తిడిని తీసుకొస్తాయని మోడీ సర్కారు తరచూ చెప్పటం కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే కేటీఆర్ వ్యవహారించటం కనిపిస్తుంది. తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి కేటీఆర్ కానీ.. ఆయన రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా డిమాండ్ చేయొచ్చు. పోరాటం చేయొచ్చు. సమస్యల్లా..అలా చేసే సమయంలో ఏపీ ప్రస్తావన తీసుకురాకుంటే సరిపోతుంది. ఏపీకి ఇచ్చినట్లే తమకూ ప్యాకేజీ ఇవ్వాలనే కేటీఆర్.. ఏపీకి మాదిరే విభజన కష్టాలు.. నష్టాలు ఇవ్వమని అడగగలరా? నష్టాలేమో ఏపీకి.. లాభాలు తెలంగాణకు అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో మరింత కాలిపోయేలా.. ఏపీకి ప్రకటించిన కొద్దిపాటి సాయాన్ని ప్రస్తావిస్తూ.. తమకు కూడా అదే తరహాలో ప్యాకేజీ కావాలంటూ మంత్రి కేటీఆర్ అడగటం సమంజసంగా లేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొని.. అమలు చేయని వాటి గురించి ప్రస్తావించటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఆ సమస్యలన్నీ విడిగా మాట్లాడితే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఏపీ ప్రస్తావన తీసుకొచ్చి మరీ తమకు సాయం చేయాలనటంలోనే అసలు సమస్యంతా. కేంద్రం దగ్గరకు వినతుల కోసం వెళ్లే తెలంగాణ సర్కారు.. తమ సమస్యల్ని ప్రస్తావించటం తప్పు కాదు కానీ.. ఆ పేరుతో ఏపీ ప్రస్తావన తీసుకొచ్చి ప్యాకేజీలు ఇవ్వాలనటమే అసలు అభ్యంతరంగా చెప్పక తప్పదు.