Begin typing your search above and press return to search.

మీరు నిధులు తెండి..మేం పవర్ లో ఉంటాం

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:16 AM GMT
మీరు నిధులు తెండి..మేం పవర్ లో ఉంటాం
X
తెలంగాణ అధికారపక్షం తీరు చిత్రంగా ఉంటుంది. టీఆర్ ఎస్ నేతలు తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుందనటానికి వారి మాటలే నిదర్శనం. విపక్షంలో ఉన్న సమయంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకు రాలేరా? అంటూ రెచ్చగొట్టేవారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిందామీదా పడి తెలంగాణ తీసుకొస్తే.. అదంతా తమ వల్లేనని.. కేసీఆర్ కారణంగానే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్తితి.

ప్రత్యేక రాష్ట్రం కానీ ప్రకటిస్తే.. కొత్త రాష్ట్రంలో తమకు పవర్ పక్కా అని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తే. అందుకు భిన్నంగా టీఆర్ ఎస్ నేతలు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తెలంగాణ ఇవ్వాలే కానీ.. తనకుపార్టీ అక్కర్లేదని.. పదవులు అక్కర్లేదని ఎన్నో మాటలు చెప్పిన టీఆర్ ఎస్ అధినేత తర్వాత ఏం చేశారో తెలిసిందే. ఇలా కాంగ్రెస్ నేతల్ని వాడేసిన టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీ నేతలపై ఫోకస్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. గల్లీల్లో తిరుగుతూ లొల్లి చేయటం కాదు.. ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకురారేం అంటూ తెలంగాణ బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అదేమంటే.. ఏపీకి చూశారా? ఎన్ని నిధులు వస్తున్నాయో.. తెలంగాణకు మాత్రం తీసుకురావటం లేదే అంటూ మండి పడుతున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్ లు ఢిల్లీకి వెళ్లి నిధులు సాధించుకు రావాలని చెబుతున్న కేటీఆర్ తీరు చూస్తే.. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తే తప్ప... వారంతట వారు ఏమీ చేయరా అన్న డౌట్ రాక తప్పదు. కేంద్రంతో సున్నం పెట్టుకునే కన్నా.. వారితో చక్కటి సంబంధాలు నెలకొల్పితే బాగుంటుంది కదా. అలాంటిదేమీ చేయని టీఆర్ఎస్ నేతలు.. కేంద్రం నుంచి మాత్రం నిధులు కావాలని కోరటం గమనార్హం. ఏపీ ప్రత్యేకహోదాను పణంగా పెట్టి కేంద్రంతో సంబంధాలు నెరుపుతూ.. ఏపీకి ఏదో ఒక ప్రయోజనం చేకూరేలా చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

అందుకు భిన్నంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రంతో సత్ సంబంధాలు ఏర్పర్చుకోకుండా.. నిధులు మాత్రం తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ బీజేపీ నేతలదే అన్నట్లుగా మాట్లాడటం చూస్తే.. ఔరా ఏమి తెలివి అని అనుకోకుండా ఉండలేం. చూస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండేందుకు మిగిలిన పార్టీలో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా..?