Begin typing your search above and press return to search.

సరదాగా అడిగినా కేటీఆర్ సందేహం సెన్సిబులే!

By:  Tupaki Desk   |   21 May 2021 4:38 AM GMT
సరదాగా అడిగినా కేటీఆర్ సందేహం సెన్సిబులే!
X
సమకాలీన రాజకీయాల్లో ఉన్న ప్రముఖులంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే.. నేటి కాలానికి తగ్గట్లుగా సీరియస్ రాజకీయాలతో పాటు.. అప్పుడప్పుడు సరదాగా పోస్టులు పెట్టటం.. ఆస్క్ మీ అంటూ నెటిజన్లతో నేరుగా సంభాషించే అలవాటున్న కొద్ది మంది నేతల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒకరు. విడిగా ఎంత ఉత్సాహంగా ఉంటారో.. సోషల్ మీడియాలోనూ ఆయన అంతే స్పీడ్ గా ఉంటారు.

తాజాగా ఆయనో సరదా ప్రశ్నను సంధిస్తూ పోస్టు పెట్టారు. కరోనా పుణ్యమా అని సామాన్యులకు ఏ మాత్రం పరిచయం లేని కొన్ని పేర్లు ఇప్పుడు రోజువారీ అవసరంగా మారటం తెలిసిందే. కరోనా తీవ్రత ఉన్న వారికి వాడాల్సిన మందులైన ‘పొసొకోనజోల్.. క్రెసంబా.. టొలిసిజిమాబ్.. రెమిడెసివిర్.. లిపొసొమల్.. ఆంఫోటెరిసిన్.. ఫ్లావిపిరవిర్.. మాల్య్నూపిరవిర్.. బరిసిట్రినిబ్’ గురించి అందరికి సుపరిచితంగా మారాయి.

ఈ మందుల పేర్లను ఇలా నోరు తిరగని విధంగా పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మీకేమైనా తెలుసా? అంటూ ప్రశ్నిస్తూనే.. ‘సరదాగా’ అడుగుతున్నా అంటూ తనపై ట్రోలింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజమే.. చాలా ఔషధాల పేర్లు నోరు తిరగని విధంగా.. పలకటానికి కష్టసాధ్యంగా ఉంటాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

సరదా అంశాన్ని ప్రస్తావించినట్లే ప్రస్తావించి.. మరో సీరియస్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కరోనా వేళ ఔషధాలు.. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలించే వారి గురించి డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.బ్లాక్ ఫంగస్ మందుల అవసరం ఉన్న వారు dme@telangana.gov.in లేదాentmcrm @telangana.gov.inల ద్వారా అప్లై చేసుకోవాలని.. వారికి మందులు ఇస్తామని చెప్పారు. సరదాగా అనిపించే అంశాల్ని ప్రస్తావించినట్లే ప్రస్తావిస్తూ ప్రజలకు అవసరమైన సీరియస్ అంశాల్ని పేర్కొనటం గమనార్హం.