Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా మారిన కేటీఆర్ ‘ఫారిన్’ కారు

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:37 AM GMT
ఆసక్తికరంగా మారిన కేటీఆర్ ‘ఫారిన్’ కారు
X
పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గత కొద్దిరోజులుగా అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. పెట్టుబడిదారులతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాల మీద ఆయన అధ్యయనం చేస్తున్నారు కూడా. కొత్త కొత్త అంశాల మీద దృష్టి పెట్టటంతో పాటు.. అత్యాధునిక సాంకేతికత మీద ఆయన ఫోకస్ చేస్తున్నారు.

వాడి పారేసే ప్లాస్టిక్ గ్లాస్ ను ఆర్నెల్ల లోపే మట్టిలో కలిసిపోయేలా రూపొందించిన కొత్త టెక్నాలజీ కేటీఆర్ ను విపరీతంగా ఆకర్షించినట్లుగా చెబుతున్నారు. పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండే ఈ టెక్నాలజీని భారత్ కు తీసుకొస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న కేటీఆర్.. ఈ తరహా కొత్త టెక్నాలజీల మీద ఫోకస్ చేస్తున్నారు. సిలికాన్ పర్యటనలో భాగంగా ఆయన సంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదిలా ఉంటే.. తన తాజా అమెరికా పర్యటన సందర్భంగా ఆయనో విదేశీ కారును ఉపయోగించారు. తన పర్యటన మొత్తం ఇదే కారులో కంటిన్యూ అయిన కేటీఆర్.. సదరు కారుపై మనసు పడినట్లుగా చెబుతున్నారు. తొలి రోజు నుంచి వాడుతున్న ఈ కారు టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు అని చెబుతున్నారు. కారు డోర్లు.. పక్షి రెక్కెల మాదిరి పక్కలకు లేవటం ఒక ఆకర్షణ అంశం అయితే.. సాంకేతికంగా కూడా ఈ కారులో అత్యాధునికంగా ఉందని తెలుస్తోంది. ఈ కారులోని విండ్ షీల్డ్ కు ఒక ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. పానోరామిక్ వ్యూతో అన్ని దిక్కులను చూసే వీలుందని చెబుతున్నారు.

కారు స్టార్ట్ అయిన నాలుగు సెకన్ల వ్యవధిలోనే వంద కిలోమీటర్ల స్పీడ్ ను అందుకునే ఈ కారు కేటీఆర్ మనసును విపరీతంగా ఆకర్షించిందని చెబుతున్నారు. కేటీఆర్ లాంటి వారు తలుచుకుంటే.. మనసు పడిన కారును అమెరికాలోనే కాదు.. హైదరాబాద్ లో కూడా వాడేయగలరు. మరి.. తన ఫారిన్ టూర్ పూర్తి అయ్యాక ఒంటరిగా వస్తారా? లేక.. తన మనసును విపరీతంగా ఆకర్షించిన టెస్లా కారును కూడా తీసుకొస్తారో చూడాలి.