Begin typing your search above and press return to search.

రాంచరణ్ పాట.. కేటీఆర్ మాట..

By:  Tupaki Desk   |   31 Oct 2018 11:24 AM IST
రాంచరణ్ పాట.. కేటీఆర్ మాట..
X
రంగస్థలం పాట ఇప్పుడు తెలంగాణలో పార్టీల ప్రచార సాధనంగా మారింది. ఆ సినిమాలో తన అన్నయ్యను సర్పంచ్ గా గెలిపించేందుకు హీరో రాంచరణ్ పాడిన ‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా’ పాట ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద హల్ చల్ చేస్తోంది.

టీఆర్ ఎస్ పార్టీకి చెందిన సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ‘ఆ గట్టునుంటావా’ పాట సాహిత్యాన్ని టీఆర్ ఎస్ పార్టీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి.. బంగారు తెలంగాణ కోసం టీఆర్ ఎస్ వైపు నిలబడాలంటూ పాటను తయారు చేశారు. ఇప్పుడా పాటను జనసామన్యంలోకి తీసుకొచ్చి పాపులర్ చేస్తున్నారు. ‘ఈ గట్టున బంగారు తెలంగాణ ఉంటుంది.. ఆ గట్టున కుక్కలు చంపిన విస్తరి ఉంటది’ అని అర్థం వచ్చేలా రచన మార్చారు. ఈ పాటలో తెలంగాణ పోరాట భాగస్వాములను కూడా మిళితం చేసి తీర్చిదిద్దారు.

మొదటి సారి చూచాయగా ఈ పాటను సెప్టెంబర్ 2న కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ లో ప్రజల సమక్షంలో ఆలపించారు. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అప్పటి నుంచి టీఆర్ ఎస్ ఈ పాటను హైజాక్ చేసి ప్రచార పర్వంలో వాడుకుంటోంది.

తాజాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఈ పాట డైలాగ్ ‘ఆ గట్టునుంటారా.. ఈ గట్టుకొస్తారో’ ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు - పట్టణాల్లో కూడా ఇదే పాటను టీఆర్ ఎస్ శ్రేణులు ప్రచారంలో వాడుకుంటూ ప్రజల్లో ఆసక్తి రేపుతున్నారు.