Begin typing your search above and press return to search.

జపాన్ మ‌న‌కు స్ఫూర్తికావాలంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   30 Jan 2018 7:19 PM GMT
జపాన్ మ‌న‌కు స్ఫూర్తికావాలంటున్న కేటీఆర్‌
X
తెలంగాణ ఐటీ - పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు జ‌పాన్ మంత్రం జ‌పించారు. ఇక అన్నింటికీ ఆ దేహే ఆద‌ర్శ‌న‌మి తెలిపారు. క‌ళాశాలల నుంచి బయటికి వచ్చే ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పరిశ్రమలకు తగ్గట్లు నైపుణ్యాలు ఉండటం లేదని ఆయ‌న ఆవేదన వ్యక్తంచేశారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు వైస్ చాన్సలర్లు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ - రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ ఈసీ) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాలు కృషిచేయాలన్నారు. విద్యార్థులకు ఎక్కువగా ప్రాక్టికల్స్ ద్వారా బోధించే విధానాన్ని తీసుకురావాలని చెప్పారు.

హిరోషిమా - నాగసాకి వంటి దుర్ఘటనలు జరిగినా, పెద్ద దేశం కాకపోయినా - భూకంపాలు - సునామీలు సవాల్‌ గా నిలిచినా జపాన్ కేవలం జ్ఞానం - ప్రాక్టికల్ విద్యతో బలమైన ఆర్థిక దేశంగా ఎదిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అనేక వనరులు అందుబాటులో ఉన్న మన దేశం కూడా గొప్పగా ఎదిగే అవకాశం కలిగి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలను ఇంజినీరింగ్ విద్యార్థులకు చేరువచేసి - పారిశ్రామిక విప్లవాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చూడాలని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు సాంకేతికతను జోడించి - వినూత్న ప్రయోగాలకు త్వరలో నాంది పలుకుతామన్నారు. వర్సిటీ పరిశోధన ఫలాలు సామాన్యుడికి సైతం చేరువవ్వాలని అన్నారు. వినూత్న ఆవిష్కరణలు చేయాలన్న కేటీఆర్.. ప్రజలు ఎక్కువగా ఇబ్బందిపడే వైద్య ఖర్చులు తగ్గించేలా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

2015లో టీహబ్ ప్రారంభించిన సమయంలో ఐదు కంటే తక్కువ ఇంక్యుబేటర్స్ ఇక్కడ ఉన్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అత్యధికంగా హైదరాబాద్‌ లోనే ఉండటం గర్వకారణమని చెప్పారు. టీహబ్ భవనం ఆవిష్కరణలకు ఉత్ప్రేకరంగా నిలుస్తున్నదని, ఆలోచనలకు ఆసరాగా నిలిచి కార్యరూపం దాల్చేలా చేస్తున్నదని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన ఇంధన వనరుల కొరత, పర్యావరణ రక్షణవంటి అంశాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు టీహబ్ - ఆర్‌ ఈసీ ముందుకురావటం సంతోషకరమని చెప్పారు. తాజా ఒప్పందంవల్ల ఏర్పాటైన ఇన్నోవేషన్ ప్లాట్‌ ఫాంలో తెలంగాణ - ఏపీలకు చెందిన 30 యూనివర్సిటీల్లోని 1800 మంది విద్యార్థులు సోలార్ - విండ్ - బయోవేస్ట్ పవర్‌ పై పరిశోధన చేస్తారని తెలిపారు. సుమారు 600 ప్రాజెక్టులను పరిశోధిస్తారని, ప్రాథమికంగా 30 ప్రాజెక్టులను పరిశీలించాక చివరకు ఉత్తమమైన 3 ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేసేందుకు గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ రక్షణకు పెద్దపీట వేసిందని - దీనికి అనుగుణంగానే హరితహారం - మిషన్ కాకతీయ - సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరుగుతాయని, హరితహారం వల్ల పచ్చదనం పెరుగుతుందని, సోలార్ వినియోగం పర్యావరణహితమని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, 16% సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని వివరించారు. మనది సన్‌షైన్ దేశమన్న కేటీఆర్.. 300 రోజులపాటు సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా సూర్యరశ్మి అందుబాటులో ఉంటుందని, దీన్ని వాడుకోగలిగే సాంకేతికతను అభివృద్ధిపరిస్తే దేశానికేగాక - ప్రపంచానికి మార్గం చూపినవాళ్లమవుతామని చెప్పారు. యంగ్ ఇండియన్స్ ప్రపంచానికి దారిచూపేదిశగా వినూత్న ఆవిష్కరణలు జరుపాలని కోరారు. ఆర్‌ ఈసీ తరహాలో ఇతర సంస్థలు ఆవిష్కరణలకు పోత్సాహాన్నిచ్చేందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని వర్సిటీలు పరిశోధనవైపు దృష్టి సారించాలని - ఉన్నతవిద్యామండలి - ఉపకులపతులు ఈ దిశగా ఆలోచించాలన్నారు.