Begin typing your search above and press return to search.

కరోనా తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన కేటీఆర్

By:  Tupaki Desk   |   24 April 2020 4:59 AM GMT
కరోనా తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన కేటీఆర్
X
ఆధునిక ప్రపంచం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితి కరోనా కారణంగా చోటు చేసుకుందని చెప్పాలి. రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన ప్రపంచానికి.. వైరస్ విరుచుకుపడితే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ప్రపంచ ప్రజలకు అర్థమైందని చెప్పాలి. తుపాకీ గుండు పేలకుండానే యావత్ ప్రపంచం స్తంభించిపోవటమే కాదు.. ప్రజలు రోడ్ల మీదకు అడుగు పెట్టకున్నా..ప్రాణాలు పోగొట్టుకుంటున్న తీరు ఆందోళనను కలిగిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా తర్వాత ప్రపంచంలో చోటు చేసుకునే మార్పులు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే మార్పులు.. భారత్ లో చోటు చేసుకునే మార్పులు ఏమిటన్న విషయంపై ప్రముఖులు పలువురు ఇప్పటికే తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అధికారం చేతిలో ఉన్న కీలక నేతల విజన్ ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్ని చెప్పాలి.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ.. కరోనా తర్వాత భారత్ ఎలా ఉంటుందన్న విషయంపై చర్చను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో పాల్గొన్న కేటీఆర్.. ఫోన్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన మూడు అంశాల్ని ప్రస్తావించారు. అవేమంటే..

1. కరోనా తర్వాత వైద్యపరమైన మౌలిక సదుపాయాల్లో చక్కటి పురోగతిని సాధిస్తాం. ఇది తెలంగాణకో.. భారత్ కో పరిమితం కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఆరోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవటం ఖాయం. కరోనా మహమ్మారి విరుచుకుపడటం విచారకరమైన అంశమే అయినప్పటికీ.. ఆరోగ్య రంగంపై పటిష్టతకు ప్రజల్లో విశ్వాసం ఏర్పడేలా ప్రభుత్వాల చర్యలు ఉంటాయి. వైద్యపరంగా మెరుగైన సాధికారతను సాధించాల్సి ఉంది.

2. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పారిశుద్ధ్యం.. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యక్తిగత శుభ్రత.. పారిశుద్ధ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాయి.

3. ప్రపంచం మొత్తం కింది స్థాయి సిబ్బందిని అంతా గుర్తిస్తారు. వారు చేసే పనులకు ప్రాధాన్యత లభిస్తుంది. ఆరోగ్య సిబ్బంది.. పారిశుద్ధ్య సిబ్బంది.. పోలీసుల సేవల్ని ఎంతోమంది కొనియాడుతున్నారు. వారు లేకుండా పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికి ఇట్టే అర్థమైపోతుంది. సమాజంలో పారిశుద్ధ్య కార్మికులకు.. వైద్యులకు.. నర్సులకు.. ఇతర కిందిస్థాయి ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించటం శుభ పరిణామం.