Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పిలుపు కేటీఆర్.. బండి సంజయ్ ‘లవంగం’

By:  Tupaki Desk   |   9 Oct 2022 4:26 AM GMT
ఇదెక్కడి పిలుపు కేటీఆర్.. బండి సంజయ్ ‘లవంగం’
X
ఇటీవల కాలంలో పోటాపోటీ మాటలతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అంటా అన్న చందంగా.. అధికార.. విపక్షాలకు చెందిన ముఖ్యనేతలు విరుచుకుపడటంతో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం మీడియా ప్రతినిదులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా బండి సంజయ్ మీద ఘాటు వ్యాఖ్యలతో పాటు.. ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

కేటీఆర్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై ఫైర్ అయ్యారు. అన్నింటికి మించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫాం హౌస్ (అదేనండి ఫార్మర్ హౌస్)లో నల్లపిల్లిని బలి ఇస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రాలు.. తంత్రాలతో తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీనికి తోడు.. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాంత్రికుడు ఇచ్చిన సలహానే ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లరని ఆరోపించారు.

ఇలా.. ఒకే రోజు అనూహ్యంగా అటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఇటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు ఇద్దరి నోటి నుంచి తాంత్రికుడు.. తాంత్రిక పూజలు.. బలులు లాంటి మాటలు కాస్త అటు ఇటుగా రావటం టీఆర్ఎస్ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటివేళ.. రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్.. కాస్తంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బండి సంజయ్ మీద సూటిగా విరుచుకుపడుతూ.. ''ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మెదలు పెడతారేమో. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి' అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఘాటు వ్యాఖ్యలకు బండి మరెలా రియాక్టు అవుతారో చూడాలి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో వాతావరణం మరింత సీరియస్ గా మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి.