Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు అడ్డంగా దొరికిపోయిన బీజేపీ

By:  Tupaki Desk   |   28 March 2018 7:04 PM IST
కేటీఆర్‌ కు అడ్డంగా దొరికిపోయిన బీజేపీ
X
తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్(ఎస్టాబ్లిష్‌ మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ -2018 బిల్లును శాసనసభలో డిప్యూటీ సీఎం - విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టి ఈ బిల్లుపై ఇవాళ సభలో చర్చ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. చాలా రాష్ర్టాల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల వల్ల విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయని కడియం చెప్పారు.

అయితే ఈ బిల్లుపై విప‌క్షాలు త‌మ ఆందోళ‌నను వ్య‌క్తం చేశాయి. బీజేపీ - కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాల అనుబంధ విద్యార్థి - యువ‌జ‌న‌ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. నిర‌స‌న‌లు తెలిపాయి. అయితే ఈ ప‌రిణామంపై సీఎం కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్రమంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును బీజేపీ వ్యతిరేకించడం విడ్డూరమని అన్నారు. విమర్శించాలి కాబట్టి విమర్షిస్తాం అన్నట్టు బీజేపీ వ్యవహార శైలి ఉంద‌ని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో స్థానిక రిజర్వేషన్ 25% పెట్టిన రాష్ట్ర కేవలం తెలంగాణ మాత్ర‌మేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. బీజేపీ మొన్నటివరకు భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం అసలు లోకల్ రిజర్వేషన్ లేకుండానే ప్రైవేటు యూనివర్సిటీ బిల్ తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు.

21రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ త‌మ పాల‌న‌లోని రాష్ర్టాల్లో ఎక్కడా ప్రైవేటు యూనివర్సిటీల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేదా అని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. `జాతీయ పార్టీ అంటే రాష్ట్రానికి ఒక తీరుగా వ్యవహరిస్తుందా? ఇలా అయితే బీజేపీ జాతీయ పార్టీ కాదు..పెద్ద సైజ్ ప్రాంతీయ పార్టీ అవుతుంది. పార్లమెంట్ లో మా ఎంపీలు రిజర్వేషన్ల పై పోరాటం చేయడాన్ని మేము తీసుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు ముడిపెట్టడం హాస్యాస్పదం` అని కేటీఆర్‌ అన్నారు. తామేమీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడటం లేదని, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. అది కూడా తెలుసుకోకుండా రాష్ట్ర బీజేపీ మాట్లాడుతుంది అంటే వల్ల అవగాహన ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీ లు వస్తే ఉన్నత ప్రమాణాలను ఉన్న విద్యే కాకుండా ఉపాది అవకాశాలు కూడా మెరుగుపడుతాయని కేటీఆర్‌ అన్నారు. చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాకుండా యూనివర్సిటీ ఉన్న ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ గుడ్డి విమర్శలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని ఆయ‌న కోరారు.