Begin typing your search above and press return to search.

కేటీఆర్ కూడా కేంద్రాన్ని ఏసుకున్నాడుగా!

By:  Tupaki Desk   |   25 March 2018 7:23 AM GMT
కేటీఆర్ కూడా కేంద్రాన్ని ఏసుకున్నాడుగా!
X
కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల తీవ్ర‌త గురించి తెలిసిందే. ఏపీకి ఏమీ చేయ‌టం లేద‌న్న చంద్ర‌బాబు మాట‌ల‌కు ప్ర‌తిగా అమిత్ షా భారీ లేఖ రాయ‌టం.. రాష్ట్రానికి చాలా చేశామ‌న్న మాట‌ను చెప్పారు. దీనికి కౌంట‌ర్ గా అమిత్ షా లేఖ‌లోని అంశాల్ని బాబు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఏపీకి సంబంధించినంత వ‌ర‌కూ కేంద్ర‌.. రాష్ట్రాల మ‌ధ్య వాద‌న‌ల జోరు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. రాజ‌కీయ వేడిని ర‌గిలిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రం తీరును త‌ప్పు ప‌ట్టారు. ఐటీఐఆర్.. పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేద‌ని.. కేవ‌లం మాట‌లే చెబుతోంది త‌ప్పించి చేత‌లు చూపించ‌ట్లేద‌ని పేర్కొన్నారు. కేంద్రం త‌మ‌కు స‌హ‌క‌రించ‌కున్నా ఐటీ విస్త‌ర‌ణ‌కు తామే చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో జ‌రిగిన ప‌ద్దుల చ‌ర్చ నేప‌థ్యంలో పారిశ్రామిక అభివృద్ధిపై స‌భ్యులు మాట్లాడిన అంశాల‌పై కేటీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు.జాతీయ స్థాయిలో ఐటీ విస్త‌ర‌ణ 9 శాతం ఉంటే తెలంగాణ‌లో మాత్రం 14 శాతంగా ఉంద‌న్నారు. 1.2 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు వ‌చ్చిన‌ట్లుగా చెప్పిన కేటీఆర్.. పారిశ్రామిక అభివృద్ధి విష‌యంలో తెలంగాణ విధానాలు బాగున్నాయ‌ని కేంద్రం చెబుతోంద‌న్నారు.

పెద్ద పెద్ద కంపెనీలు.. బ‌డా వ్యాపార‌వేత్త‌లు న‌గ‌దు దోచుకొని దేశం విడిచి పారిపోతుంటే వ‌దిలేస్తున్న కేంద్రం.. రిజ‌ర్వ్ బ్యాంకు.. చిన్న పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. ముచ్చ‌ర్ల‌లో ఫార్మా సిటీ విష‌యంలో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అయితే కేంద్రంతో చెప్పి దాన్ని అడ్డుకుంటామ‌ని బీజేపీ నేత‌లు చెప్ప‌టం స‌మంజ‌సం కాద‌న్నారు.

ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లంటూ లోపాల్ని ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీ నేత‌లు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో తెలుసా? అని ప్ర‌శ్నించాఉ. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించ‌కుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. నాలుగు ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెబితే అడ్డుకుంటారా? అని ప్ర‌శ్నించిన కేటీఆర్‌.. భూములు న‌ష్ట‌పోయే వారికి న‌ష్ట‌ప‌రిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం క‌ల్పిస్తామ‌న్నారు.కాలుష్య కార‌క 13 ప‌రిశ్ర‌మ‌ల్ని మూసివేశామ‌ని.. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో వంద ప‌రిశ్ర‌మ‌లు హైద‌రాబాద్ న‌గ‌రం బ‌య‌ట‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. హైద‌రాబాద్ ను కాలుష్యర‌హిత న‌గ‌రంగా మారుస్తామ‌న్నారు. కేంద్రం తీరును వ్య‌తిరేకించేలా మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌.. మ‌రోవైపు ఢిల్లీలో మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఎందుకు అడ్డుప‌డుతున్న‌ట్లు?