Begin typing your search above and press return to search.

కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   3 April 2018 10:09 AM GMT
కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటున్న కేటీఆర్‌
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. తెలంగాణ‌కు సంబంధించిన ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.కొత్తగూడెంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ - ఆరోగ్యలక్ష్మీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం మాటలతో కాలం గడుపుతుందని ధ్వజమెత్తారు. కేంద్రం స్పందించకపోయినా సింగరేణి - టీఎస్‌ ఎండీసీ కలిసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏ ఉక్కు లేని విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఛత్తీస్‌ గఢ్ నుంచి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు ముడి ఉక్కును తరలిస్తున్నారు కానీ ఛత్తీస్‌గఢ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో బయ్యారం ఉన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందని కేటీఆర్ అన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో కొత్తగూడెం హైదరాబాద్‌ తో పోటీ పడుతుందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. జాన్‌ డీర్ - ఐటీసీ లాంటి సంస్థలు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ ప్రాంత యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం నెలకొల్పేందుకు సీఎం పచ్చ జెండా ఊపారని కేటీఆర్ గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. కొత్తగూడెం - పాల్వంచను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.