Begin typing your search above and press return to search.

కేటీఆర్ మాట:కేంద్రం మూర్ఖ‌పు బుద్ధి

By:  Tupaki Desk   |   29 April 2018 4:32 AM GMT
కేటీఆర్ మాట:కేంద్రం మూర్ఖ‌పు బుద్ధి
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ లోని మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వద్ద రూ.25,78 కోట్లతో నిర్మించిన అండర్‌ పాస్‌ ను ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రం తీరుపై మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా చేపట్టిన ప్లై ఓవర్ల నిర్మాణపనులకు గడువు నిర్దేశించుకుని, ఆలోపు గానే పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.7700 కోట్లకు పైగా ఖ‌ర్చుతో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. అయితే త‌మ‌కు కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు.

సికింద్రాబాద్ పారడైజ్ నుంచి తూముకుంట - ప్యాట్నీ సెంటర్ నుంచి కొంపల్లి సుచిత్ర వరకు హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో రెండు ఎక్స్‌ ప్రెస్‌ వేల నిర్మాణం విష‌యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ఎక్స్ ప్రెస్‌ వేల నిర్మాణానికి ప్రతిపాదనలతోపాటు రూ.2500కోట్ల నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ ఆధీనంలోని వంద ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని తెలిపారు. అయితే, స్థలాన్ని ఇచ్చే విషయంలో రక్షణశాఖ మూర్ఖంగా వ్యవహరిస్తూ పనులకు మోకాలడ్డుతున్నదని మంత్రి విమర్శించారు. రక్షణశాఖ ఇచ్చే వంద ఎకరాలకు బదులుగా వారు కోరినట్టు మరోచోట 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయినా రక్షణశాఖ వినకుండా ప్రత్యామ్నాయ భూమితోపాటు ఏటా రూ.30 కోట్ల చొప్పున చెల్లిస్తే తప్ప తాము తమ స్థలాన్ని వదులుకునేది లేదంటూ మొండిగా వ్యవహరిస్తున్నదని మంత్రి మండిప‌డ్డారు. ఎక్స్‌ ప్రెస్‌ వేల కోసం ప్రతిపాదిత 100 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కనీసం రూ.30కోట్ల వరకు అద్దెలు వచ్చే వీలున్నందున ఆ మేరకు ప్రభుత్వం ఎల్లకాలం రూ.30కోట్ల చొప్పున తమకు చెల్లించాలని రక్షణశాఖ కోరుతున్నదని ఆయన వివరించారు.

రక్షణశాఖ తరచూ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లను మూసివేస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకే తాము ఎక్స్‌ ప్రెస్‌ వేల నిర్మాణానికి ప్రతిపాదించగా, కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా మొండివైఖరి అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని, నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణశాఖ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. తరచూ రోడ్లను మూయడంవల్ల సైనిక్‌ పురి - కాప్రా - ఈసీఐఎల్ తదితర ప్రాంతాలనుంచి వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మే ఐదున ఎంపీ లు - రక్షణశాఖ ఎస్టేట్ అధికారులతో రక్షణశాఖ సమావేశం నిర్వహిస్తున్నదని, ఈ సందర్భంగా ప్రతిపాదిత ఎక్స్‌ ప్రెస్‌ వేల నిర్మాణానికి వంద ఎకరాల స్థలాన్ని ఇవ్వడంతోపాటు రోడ్లను మూసివేసే ప్రతిపాదనలపై తమకు అనుకూలంగా తగు నిర్ణయం తీసుకోవాలని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కు మంత్రి విజ్ఞప్తి చేశారు.