Begin typing your search above and press return to search.

కేంద్రంపై కేటీఆర్ క‌న్నెర్ర‌..కొత్త కోణంతో అటాక్‌

By:  Tupaki Desk   |   5 Jan 2019 4:50 PM GMT
కేంద్రంపై కేటీఆర్ క‌న్నెర్ర‌..కొత్త కోణంతో అటాక్‌
X
టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించమని పార్లమెంట్ లో జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ చేసిన ప్రకటన పైన కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి అయోగ్ అనేకసార్లు ప్రశంసలు తెలపడంతోపాటు ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 24 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేవలం తెలంగాణలో తమ పార్టీకి ఉనికే లేదనే రాజకీయ దురుద్దేశం - వివక్షాపూరిత వైఖరితోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను - ప్రాజెక్టులకు అడ్డుపుల్ల వేస్తున్నదన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని తాగునీటి ప్రాజెక్టు లో 25 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా కింద సుమారు 3,800 కోట్ల రూపాయలను విడుదల చేసిందని - అదే సమయంలో పలు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు టిఆర్ ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ భవన్‌ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్షతో పాటు సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిప‌డ్డారు. తాము బలంగా లేని తెలంగాణకు ఎందుకు సాయం చేయాలన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని నిప్పులు చెరిగారు. తెలంగాణ పట్ల బీజేపీది సవతి తల్లి ప్రేమ అని కోపోద్రిక్తులయ్యారు. తమ ఉనికి లేదని తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇదే తీరుగా వ్యవహరిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు. 2014లో బీజేపీ గెలిచిన సీటు కూడా ఇప్పుడు రాదన్నారు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు బీజేపీ వైఖరి ఉందన్నారు.

బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తూ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర సాగునీటి పథకాలకు కేంద్రం ఇటీవలే రూ. 3883 కోట్లు సాయం చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ర్టాలకే ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పోలవరానికి 95 శాతం నిధులిస్తున్న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం వైఖరిని పార్లమెంట్ లో ఎండగడుతూ నిలదీస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.