Begin typing your search above and press return to search.

తనకైనా నో చెప్పమంటున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   22 July 2016 9:41 AM GMT
తనకైనా నో చెప్పమంటున్న కేటీఆర్
X
తనకున్న బోలెడంత బిజీలో హైదరాబాద్ నగర బాగోగులు.. పెండింగ్ పనుల గురించి అప్పుడప్పుడు సమీక్షించి.. సలహాలు.. సూచనలు చెబితే లాభం లేదన్న విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్ లోని రోడ్లపై మీద అగ్గి ఫైర్ అవుతుందన్న కేటీఆర్.. తాజాగా నగరంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్ లపైనా.. కటౌట్ల పైనా తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ హోర్డింగ్ లు.. బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్.. ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. అక్రమంగా తన పేరిట ఏర్పాటు చేసే హోర్డింగులు.. బ్యానర్ల విషయంలో అయినా చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి ఉపేక్ష అక్కర్లేదని కేటీఆర్ తేల్చి చెప్పటం గమనార్హం.

గతంలో అప్పుడప్పడు మాత్రమే హైదరాబాద్ మహానగర సమస్యల మీద దృష్టి సారించే అలవాటున్న కేటీఆర్.. తాను కానీ రోజూవారీగా కల్పించుకొకపోతే.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతాయన్న విషయాన్ని గుర్తించినట్లుగా ఉంది. తానిచ్చే ఆదేశాలు అధికారులకు సరిగా అర్థం అవుతాయా? లేదా? అన్న సందేహమో.. లేక అధికార పార్టీకి చెందిన వారికి అధికారులు సహజంగా ఇచ్చే మినహాయింపుల నేపథ్యంలోనే.. తన బర్త్ డే కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని చెప్పటం ద్వారా.. ఎవరికి ఎలాంటి మినహాయింపు లేదన్న విషయాల్ని కేటీఆర్ తేల్చేసినట్లు చెప్పాలి.

స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ మాటల్ని అధికారులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక.. తాను గుర్తించిన సమస్యల్ని ప్రస్తావించి వదిలేయకుండా.. టైమ్ లిమిట్ పెట్టటం.. చెప్పిన సమయంలోపు పనులు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవటం లాంటివి చేస్తే.. మొద్దునిద్ర పోతున్న అధికార వ్యవస్థలో చలనం వచ్చి పరుగులు పెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. కేటీఆర్ కత్తి దూస్తారా?