Begin typing your search above and press return to search.

అధికారులకు షాకిచ్చే మాట చెప్పిన కేటీఆర్

By:  Tupaki Desk   |   20 Jun 2016 7:22 AM GMT
అధికారులకు షాకిచ్చే మాట చెప్పిన కేటీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతల్ని ప్రత్యేకంగా చూస్తున్న ఆయన.. ఇటీవల కాలంలో అధికారుల పని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలిసిందే. ఈ మధ్యన నగరంలో ఆకస్మిక పర్యటన చేసి.. రోడ్ల దుస్థితి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాజాగా మరోసారి రోడ్ల వ్యవహారంపై ఫైర్ అయ్యారు.

చిన్న వర్షానికే కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్లు దెబ్బ తినటం ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నగర రోడ్లు ఎయిర్ పోర్ట్.. ఔటర్ రింగ్ రోడ్ రోడ్ల మాదిరి ఉండాలన్న ఆయన.. ప్రజలకు చక్కటి రోడ్లను అందించాల్సిన బాధ్యత అధికారులు.. ప్రభుత్వం మీదనే ఉందన్నారు. రోడ్ల తీరును మార్చేందుకు చట్టాల్లో మార్పులు తీసుకొస్తామన్న ఆయన ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. మహానగర రోడ్లను సర్కిళ్ల వారీగా ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

కేటీఆర్ ఇంతలా ఫైర్ కావటానికి కారణం లేకపోలేదు. ఈ రోజు ఉదయం ఆయన నగరంలోని రోడ్ల పరిస్థితిపై రివ్యూ సమావేశాన్ని పెట్టుకున్నారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన ఆయన.. 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఈ లేట్ కి కారణంగా. రోడ్లు ఛండాలంగా ఉండటం.. దాని కారణంగా ట్రాఫిక్ జాం కావటమేనని చెప్పుకొచ్చారు.

తనకు ఎదురైన తాజా అనుభవంతో చిర్రెత్తిన కేటీఆర్.. రోడ్లను ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పచెబుతామంటూ చెప్పిన తాజా మాటలు.. రోడ్ల మీద బతికేస్తున్న కాంట్రాక్టర్లకు.. అధికారులకు.. చోటామోటా నేతలకు చెడు కాలం వచ్చేసినట్లే. ఇంతకీ ఈ సంచలన నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు ఎప్పటికి తీసుకుంటుందో చూడాలి.