Begin typing your search above and press return to search.

శ‌భాష్ కేటీఆర్‌..మోడీని ఇలా కూడా తిట్టొచ్చా?

By:  Tupaki Desk   |   29 Sep 2018 8:38 AM GMT
శ‌భాష్ కేటీఆర్‌..మోడీని ఇలా కూడా తిట్టొచ్చా?
X
ఏమాటకు ఆ మాటే.. తాజా మాజీ మంత్రి కేటీఆర్ ను మెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో కాబోయే తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పేరు బ‌లంగా వినిపిస్తోంది. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా.. తాను టార్గెట్ చేస్తే అల్లాట‌ప్పా వాళ్ల‌ను కాకుండా.. త‌న కంటే వంద‌ల రెట్లు బ‌ల‌మున్న వారిపై దునుమాడ‌టంలో కేటీఆర్ తీరే కాస్త భిన్నంగా ఉంటుంది. మామూలుగా అయితే.. త‌మ కంటే పెద్ద స్థానాల్లో ఉన్న‌నేత‌ల్ని తిట్టే విష‌యంలోకాస్త వెనుకా ముందు ఆడుతుంటారు. కానీ.. కేటీఆర్ అలా కాదు. ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా క‌డిగిపారేస్తారు.

ఈ విష‌యంలో త‌న తండ్రి కేసీఆర్ కంటే నాలుగు ఆకులు ఎక్కువ తిన్నార‌నే చెప్పాలి. తెలంగాణ రావ‌టంలో కీల‌క‌మైన సోనియాను అమ్మా.. బొమ్మా అనేసినా.. అమిత్ షానా.. భ్ర‌మిత్ షానా? అంటూ క‌డిగేయ‌టం కేటీఆర్ కు మాత్ర‌మే చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ప్ర‌ధాని మోడీపైన ఫైర్ అవుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో మోడీపై అదేప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తున్న కేటీఆర్.. తాజాగా మ‌రింత ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశంలో రోజురోజుకూ మోడీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌న్న‌కేటీఆర్‌.. మోడీ.. రాహుల్ ఇద్ద‌రి గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని.. రానున్న‌ది సంకీర్ణ‌మేన‌ని చెప్పారు.

రానున్న రోజుల్లో టీఆర్ఎస్‌.. కేసీఆర్ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మార‌తార‌ని.. కేంద్రం మెడ‌లు వంచి రాష్ట్రాల‌కు నిధులు తెచ్చుకుంటామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మోడీపై ఆయ‌న ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు. 2014లో మోడీపై సామాన్య ప్ర‌జ‌ల్లో కొంత అభిమానం ఉండేద‌ని.. కానీ ప్ర‌స్తుతం మాత్రం అందుకు భిన్నంగా ఆయ‌న ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారుతోంద‌న్నారు.

రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌ల్లో ఒక్క సంత‌కం కోసం మోడీ తొమ్మిది నెల‌లు తిప్పించుకున్న విష‌యాన్ని గుర్తు చేసుకొని ఫైర్ అయ్యారు. మోడీని కేసీఆర్ 20సార్లు క‌లిసినా ఫ‌లితం లేద‌ని.. హైకోర్టు విభ‌జ‌న‌.. రాష్ట్రానికి ప‌న్ను రాయితీలు లాంటి ఏ హామీలు కేంద్రం నిల‌బెట్టుకోలేద‌న్న కేటీఆర్‌.. తెలంగాణ‌కు రూ.2.3ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని అమిత్ షా చెబుతార‌ని.. రాష్ట్రం నుంచి ప‌న్నులు క‌డితేనే ఇచ్చారు త‌ప్పించి.. కేంద్రం ఏమైనా కొత్త‌గా ఇచ్చారా? అంటూ క్వ‌శ్చ‌న్ వేశారు. బీజేపీ నేత‌ల నోటికి తాళం వేసేలా మోడీపై విరుచుకుప‌డుతున్న కేటీఆర్‌.. త‌న నోటి మాట‌ల ముందు ఎవ‌రైనా చిన్న‌బోతార‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.