Begin typing your search above and press return to search.

గ‌డ్డంపై కేటీఆర్ పంచ్ అదిరిపోలేదా?

By:  Tupaki Desk   |   14 Nov 2016 6:21 AM GMT
గ‌డ్డంపై కేటీఆర్ పంచ్ అదిరిపోలేదా?
X
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని.. ప్రతి ఒక్కరూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పాలనకు నీరాజనాలు పడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించని కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కుతున్నారని మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. నెహ్రూ నుంచి మన్మోహన్‌ దాకా దేశాన్ని పాలించింది ఆ పార్టీ నాయకులు కారా? అని ప్రశ్నించారు. 65 ఏండ్లలో జరగని అభివృద్ధి రెండున్నరేండ్లల్లోనే జరుగుతుందా? అని మండిపడ్డారు. పంచె కట్టినంత మాత్రాన రైతులు కారని - గడ్డాలు పెంచితే బాబాలు కాలేరని ప్రతిపక్ష నేతలపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఖమ్మం కార్పొరేషన్ - పాలేరు ఎన్నికల్లో ప్రజలు కర్రకాల్చి వాతలు పెట్టినా కూడా కొన్ని పార్టీల నేతలకు బుద్ధి రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నదని అన్నారు. చింత చచ్చినా పులుపు చావకపోవడం అంటే ఇదేనేమోనని కేటీఆర్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంత‌రం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అన్ని కుంభకోణాలకు కేంద్రబిందువు కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు.తెలంగాణలో అభివృద్ధిని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొంటుంటే రాష్ట్రంలోని కొన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు - పల్లె నిద్రల పేరుతో జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుప‌డ్డారు. గ‌త ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కారులో దహనమైన రూ.3 కోట్లు ఎక్కడివి అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పసిగుడ్డులాంటి తెలంగాణపై విషం జిమ్ముతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు - కేంద్రం.. రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయాలని చేస్తున్నాయని - అయినా వీటన్నింటినీ ఎదుర్కొంటూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్నదన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పీ అజయ్‌ కుమార్ అభ్యర్థన మేరకు ఖమ్మంలో 50 వేల చదరపు మీటర్ల ఐటీ టవర్‌ ను నిర్మిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రఘునాథపాలెం మండలంలోని 22 మంది దళితులకు భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని డ్వాక్రా మహిళలకు రూ.5.15 కోట్ల రుణాలను చెక్కు అందజేశారు. అంతకుముందు ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/