Begin typing your search above and press return to search.

2029 వ‌ర‌కూ నాన్న‌కు తిరుగులేద‌న్న కేటీఆర్

By:  Tupaki Desk   |   10 Aug 2017 5:57 AM GMT
2029 వ‌ర‌కూ నాన్న‌కు తిరుగులేద‌న్న కేటీఆర్
X
మీడియా మిత్రుల‌తో ముఖ్య‌నేత‌లు మ‌న‌సు విప్పి మాట్లాడుతుంటారు. అయితే.. ఇలాంటి ఇష్టాగోష్ఠుల వెనుక లెక్క‌లు వేరుగా ఉంటాయ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఉదాహ‌ర‌ణ‌కు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఏదైనా పెద్ద నిర్ణ‌యం తీసుకున్నా.. వెంట‌నే మీడియా మిత్రుల‌తో క‌లుస్తుంటారు. తాను తీసుకున్న నిర్ణ‌యంపై ఫ్యీడ్ బ్యాక్ తీసుకునే అల‌వాటుంది. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న నిత్యం మీడియా వాళ్ల‌తో మాట్లాడుతుంటారు. ఇక‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది కాస్త భిన్న‌మైన పంథా. ఉద్య‌మ నేత‌గా ఉన్న‌ప్పుడు ఒక నియ‌మిత కాలానికి ఒక‌సారి త‌న బీట్ చూసే విలేక‌రుల‌ను పిలిపించుకొని మాట్లాడేవారు. తెలంగాణ సాధ‌న ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చెప్పుకునేవారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మీడియా వారితో మాట్లాడ‌టం.. అది కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడ‌టం బాగా త‌గ్గింద‌నే చెప్పాలి. ముఖ్య‌మంత్రుల తీరు ఇలా ఉంటే.. ఆయ‌న వార‌సుల విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు త‌న‌యుడు క‌మ్‌ మంత్రి లోకేశ్ కూడా మీడియా ప్ర‌తినిధుల‌తో ట‌చ్ లో ఉండ‌టం క‌నిపిస్తుంది. లోకేశ్ అంత కాకున్నా.. మంత్రి కేటీఆర్ కూడా మీడియాతో ఫ్రెండ్లీగానే ఉంటారు. అయితే.. ఇష్టాగోష్ఠిగా మాట్లాడ‌టం కాస్త త‌క్కువే.

ఇటీవ‌ల కాలంలో నేరెళ్ల ఇష్యూ.. త‌న కొడుకు పేరు మీద ఉన్న కంపెనీతో పాటు.. కాంగ్రెస్ తో ఉన్న పంచాయితీ ఇలా ప‌లు అంశాలు వ‌రుస‌గా చోటు చేసుకోవ‌టం.. దీనిపై క్లారిఫికేష‌న్ ఇస్తే బాగుంటుంద‌న్న స‌న్నిహితుల సూచ‌న‌తో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశార‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా మీడియా మిత్రుల‌ను క‌లిసిన సంద‌ర్భంగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని.. ఏ పార్టీతో పొత్తు లేకుండా సునాయ‌సంగా గెల‌వ‌టం ప‌క్కా అన్న ధీమాను వ్య‌క్తం చేశారు. బీజేపీ నుంచి త‌మ‌కు పోటీయే లేద‌ని.. ఇప్పుడున్న స్థానాలు కూడా ఆ పార్టీకి వ‌స్తాయా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. ఇక‌.. టీడీపీ.. వామ‌ప‌క్షాల ఉనికే లేద‌ని తేల్చేశారు.

అంద‌రూ అనుకున్న‌ట్లు మంత్రి హ‌రీశ్ రావుతో త‌న‌కు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌ని.. త‌మ మ‌ధ్య సీఎం ప‌ద‌వికి సంబంధించి ఎలాంటి రేసు లేద‌న్నారు. 2029 వ‌ర‌కూ కేసీఆరే ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ బ‌లంగా ఉంద‌ని.. 50శాతానికి పైగా ఓట్లు త‌మ‌కొస్తాయ‌న్నారు. కేసీఆర్ ఉన్నంత‌వ‌ర‌కూ త‌మ‌కు ఎదురు లేద‌ని అస‌దుద్దీన్ ఓవైసీ చెప్పార‌న్నారు.

సింహం సింగిల్ గానే వ‌స్తుంద‌ని.. బీజేపీతో స‌హా మ‌రే పార్టీతోనూ త‌మ‌కు పొత్తు అవ‌స‌రం లేద‌ని.. రాష్ట్రప‌తి.. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ అంశాల‌పై సిద్ధాంత‌ప‌రంగా మ‌ద్ద‌తు ఇచ్చామే కానీ త‌మ‌కు మ‌రే ఆలోచ‌న లేద‌న్నారు. ఎన్డీయే స‌ర్కారు తెలంగాణ‌కు చేసిందేమీ లేద‌న్న కేటీఆర్‌.. విభ‌జ‌న హామీల్లో ఏదీ నెర‌వేర్చ‌లేదంటూ లిస్ట్ చెప్పుకొచ్చారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల మీదా.. ప్రాజెక్టుల మీద 5 శాతానికి జీఎస్టీని త‌గ్గించాల‌ని.. లేని ప‌క్షంలో రాష్ట్ర స‌ర్కారుపై భారీ భారం ప‌డుతుంద‌న్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌పై పన్నులు వేస్తార‌ని అనుకోలేద‌ని..జీఎస్టీ కార‌ణంగా రూ.19వేల కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

హ‌రీశ్ తో త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య అన్ని అంశాల‌పైనా స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు. త‌మ ఇద్ద‌రి కంటే కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. అంద‌రు ఎమ్మెల్యేల కంటే కూడా మంత్రి హ‌రీశ్ రావు ఎక్కువ‌గా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తుంటార‌న్న కేటీఆర్‌.. ఆదివారం సెల‌వు తీసుకోవాల‌ని కోరినా ఆయ‌న విన‌టం లేద‌న్నారు.

నేరెళ్ల ఎపిసోడ్ మీద కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు అతిగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు. ఆ సంఘ‌ట‌న వివ‌రాలు త‌న‌కు తెలియ‌లేద‌ని.. కేసులు పెట్టిన విష‌యం.. క‌స్ట‌డీలో తీసుకొని కొట్టిన విష‌యం త‌న‌కు తెలీద‌న్నారు. ఘ‌ట‌న పూర్తిగా జ‌రిగిన త‌ర్వాతే త‌న‌కు వివ‌రాలు తెలిశాయ‌న్నారు. ఇందులో తమ స్థానిక నాయ‌క‌త్వం వైఫ‌ల్యం ఉంద‌న్న కేటీఆర్‌.. తాను జోక్యం చేసుకునే లోపే అక్క‌డి రాజ‌కీయ ప‌ర్యాట‌కులు ఎక్కువ‌య్యార‌న్నారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టార‌ని.. తాను వెళ్లి ప‌రామ‌ర్శించిన‌ట్లు చెప్పారు. త‌మ‌ను భ‌యంక‌రంగా కొట్టిన‌ట్లు బాధితులు చెప్పార‌ని.. డీఐజీతో విచార‌ణ జ‌రిపి..నివేదిక ఇవ్వాల‌ని చెప్పిన‌ట్లు చెప్పారు. తానురాజ‌కీయాల్లో ఉన్నంత వ‌ర‌కూ సిరిసిల్ల నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పిన కేటీఆర్.. ఇసుక మాఫియాను అరిక‌ట్టిన ఘ‌న‌త త‌మ‌దేన‌న్నారు.

త‌న‌తో పాటు త‌న కొడుకును కొంద‌రు నేత‌లు తిట్ట‌టం పైన కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారు అలా తిట్ట‌టం త‌న‌కు బాధ క‌లిగించింద‌ని.. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చానా? అనిపించింద‌న్నారు. హిమాన్ష్ మోటార్స్ ఎపిసోడ్ గురించి వివ‌రిస్తూ.. తాను 2004లో అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాత పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి అనే స్నేహితుడితో క‌లిసి సిద్ధిపేట వ‌ద్ద హిమాన్ష్ ట్రాక్ట‌ర్ యార్డును ఏర్పాటు చేశామ‌న్నారు. రాజ‌కీయాల మీద దృష్టిపెట్ట‌టంతో ఆ వ్యాపారంలో న‌ష్టం వ‌చ్చింద‌ని దీంతో 2011 నుంచి దాని కార్య‌క‌లాపాలు ఆపేసిన‌ట్లు చెప్పారు. ట్రాక్ట‌ర్లు కొనే కంపెనీకి ఇన్నోవా కార్లు.. బైకుల‌కు సంబంధం ఏముంటుంద‌న్న ప్ర‌శ్న‌ను ఆయ‌న సంధించారు.

న‌వంబ‌రులో మెట్రో ప్రారంభానికి ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం అడిగామ‌ని.. ఇంకా ఖ‌రారు కాలేద‌న్నారు. టీఆర్ఎస్ లో 75 ల‌క్ష‌ల మంది స‌భ్యులు చేరార‌ని.. వాట‌న్నింటిని డిజిట‌లైజ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఫోటోలు.. ఫోన్ నెంబ‌ర్లు.. అడ్ర‌స్ లు న‌మోదు చేస్తున్న‌ట్లు చెప్పారు. మొత్తం 75 ల‌క్ష‌ల మందికి ఒకేసారి మెసేజ్ లు పంపేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.