Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి ఉప ఎన్నిక భ‌యం ఎందుకు?

By:  Tupaki Desk   |   6 April 2018 5:40 AM GMT
కోమ‌టిరెడ్డికి ఉప ఎన్నిక భ‌యం ఎందుకు?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌హీన‌ప‌ర్చ‌డంతో పాటుగా ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌ల‌ను ఎమోష‌న‌ల్‌గా ఇబ్బంది పెట్టేందుకు కేటీఆర్ గురిపెట్టిన‌ట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. సీఎల్పీ నాయ‌కుడైన జానారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో తాజాగా ప‌ర్య‌టించిన కేటీఆర్ ఇటు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు - ప్రారంభోత్స‌వాలు చేయ‌డంతో పాటుగా ప‌లు రాజ‌కీయ ల‌క్ష్యాలు సైతం విధించుకున్నారు. ఒకే వేదిక‌గా పీసీసీ ర‌థ‌సార‌థి ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నాయకుడు జానారెడ్డి - పార్టీ సీనియ‌ర్ నేత‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి స‌వాల్ విస‌ర‌డం గ‌మ‌నార్హం.

2019లో టీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని.. కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ సవాలుకు సిద్ధపడకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన ఒప్పుకున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పారు. `టీఆర్ ఎస్ గెలువకపోతే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధం. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డీ.. నీకు దమ్ముందా? ముందుకురా. నా సవాలును స్వీకరించేందుకు నువ్వు సిద్ధమా..? కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఉత్తమ్ - సీఎల్పీ నాయకుడు జానారెడ్డి- కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి చెందిన జిల్లాలోనే సవాలుచేస్తున్నాను. దీనికి స్పందించే ద‌మ్ముందా? ` అంటూ కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌ కు 80 నుంచి 90 సీట్లొస్తాయని కోతలు కోస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాటలు ఉత్త మాటలని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. త‌మ వెంట ఎవరూ లేకపోవడంతో దిక్కుతోచక యాత్రల పేరుతో తిరుగుతున్నారని విమర్శించారు. `బస్సుయాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు తమకు 80 సీట్లొస్తాయని అంటున్నారు. అయితే కొంతమంది గురుకులాల్లో సీట్లా? లేక తండాలను పంచాయతీలుగా మార్చిన తర్వాత సర్పంచుల సీట్లా? అని అడుగుతున్నారు` అని ఎద్దేవాచేశారు. `2014 లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పినా వారి వైఖరిలో మార్పురాకపోవడం దురదృష్టకరం. పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే ఏ విధంగా భయపడుతారో.. అదేవిధంగా ఇపుడు ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలంటే జంకుతోంది. నల్లగొండ నుంచి సిద్ధ‌మై గజ్వేల్‌ లో పోటీచేస్తానని ప్రగల్భాలు పలికిన కోమటిరెడ్డి ఇక్కడ ఎన్నిక వస్తుందని భయపడి దొంగచాటుగా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు` అంటూ ఎద్దేవా చేశారు.