Begin typing your search above and press return to search.

రాహుల్ కొత్త బిచ్చ‌గాడు..కాంగ్రెస్ నేత‌లు లుచ్చాగాళ్లు

By:  Tupaki Desk   |   15 Aug 2018 7:01 PM GMT
రాహుల్ కొత్త బిచ్చ‌గాడు..కాంగ్రెస్ నేత‌లు లుచ్చాగాళ్లు
X
తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన రెండురోజుల ప‌ర్య‌ట‌న రాష్ట్రంలో రాజ‌కీయ వేడిని తారాస్థాయికి చేర్చింది ఇప్ప‌టికే ఆయా పార్టీలు ఎన్నిక‌ల మూడ్‌లోకి వ‌చ్చేయ‌గా తాజాగా రాహుల్ టూర్‌ తో అధికార టీఆర్ ఎస్ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. త‌న టూర్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై రాహుల్ దుమ్మెత్తిపోయ‌గా...ఆయ‌న‌పై టీఆర్ ఎస్ పార్టీ సైతం విరుచుకుప‌డుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు కాంగ్రెస్ ర‌థ‌సార‌థిపై మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఛీ కొట్టినా కొంత మంది ప్రతిపక్ష నాయకులకు బుద్ధి రావడం లేదని విమర్శించారు.

ఇవాళ మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంఖుస్థాప‌న చేసిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. "నాలుగేళ్లుగా రాని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారు. రాహుల్ గాంధీ ఇక్కడ ఏం చేస్తారు. సొంత మున్సిపాలిటీని కూడా రాహుల్ గెలిపించుకోలేకపోయారు. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఓడిపోతుంది. 56 ఏళ్లలో సాధించని అభివృద్ధిని నాలుగేళ్లలో సాధించాం. అభివృద్ధిని చూసి ఓర్వలేని పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. అధికార విరహవేదన మీది.. పనులు చేయాలన్న తపన మాది`` అని కేటీఆర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థకంతో కాంగ్రెస్ నేత‌ల‌పై సెటైర్లు వేశారు. తాము చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ నేత‌ల‌కు కనిపించకపోతే 'కంటి వెలుగు'లో చికిత్స చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.

సంక్రాంతి కి గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వచ్చారని కేటీఆర్ అన్నారు. గంగిరిద్దుల వాళ్ళు మంచి వాళ్లే.. కాంగ్రెస్ వాళ్లే లుచ్చాగాళ్ళు అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తన సొంత నియోజకవర్గం అమేధిలో మున్సిపాలిటీని గెలిపించలేని రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తాడంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయ‌కురాలు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ పెట్టిన కాంగ్రెస్ నేత‌లు..మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీతో చెప్పించుకునే స్థితిలో తాము లేమని కేటీఆర్ అన్నారు. ``కర్నాటకలో 30 వేల కోట్ల రుణ మాఫీ చేసానని రాహుల్ చెప్పడం పూర్తి అబద్ధం. అది కుమార స్వామి హామీ. అక్కడ కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తున్నారు.`` అని కేటీఆర్ తెలిపారు. రెండు రోజుల రాహుల్ పర్యటనలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నాడు తప్ప.. తెలంగాణకు ఏమిస్తారో చెప్పలేదన్నారు. జలయజ్ఙం-ధనయజ్ఙం అయింది మీ హయామలో కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు 3 కోట్లతో ఉత్తమ్ అడ్డంగా దొరికిపోయాడని, ఆయ‌న కూడా త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తారా అని ప్ర‌శ్నించారు.