Begin typing your search above and press return to search.

రాహుల్ కుటుంబానికి-తెలంగాణ పౌరుషానికి మధ్యే పోటీ

By:  Tupaki Desk   |   6 Oct 2018 4:21 PM GMT
రాహుల్ కుటుంబానికి-తెలంగాణ పౌరుషానికి మధ్యే పోటీ
X
తెలంగాణ‌లో నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శల ప‌దును పెరుగుతోంది. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇది కాస్త ముదిరి కుటుంబం - వంశం స్థాయికి చేరింది. తెలంగాణ భవన్‌ లో జరుగుతున్న టీఆర్‌ ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ ఎస్ పార్టీ నేత‌ - మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ ఆస‌క్తిక‌ర‌ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులు.. చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకు బలుపెక్కువ అని మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ కుటుంబానికి - తెలంగాణ పౌరుషానికి మధ్యే పోటీ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ``ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి నేను సైనికుడిని అని చెప్పుకుంటాడు.. ఉద్యమ సమయంలో విద్యార్థులు వీర సైనికుల్లా పోరాటం చేస్తే.. మరి ఈ సైనికుడు ఎక్కడ ఉన్నాడు? ఉద్యమ సమయంలో ఈ ఆరేడు అడుగుల నాయకులు ఎక్కడ ఉన్నారు. నేను గట్టిగా మాట్లాడితే బచ్చా అంటారు? కాంగ్రెస్ నేతలు దద్దమ్మళ్ల ఇంట్లో ఉంటే.. ఈ బచ్చాగాళ్లే కదా తెలంగాణను తీసుకువచ్చింది. సైనికుడు కాదు.. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి బంట్రోత్`` అని విరుచుకుప‌డ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలపై విద్యార్థులకు ఎక్కువ అవగాహన ఉందన్నారు. కేసీఆర్‌ ను ఎందుకు గెలిపించాలో అది కూడా విద్యార్థులకే ఎక్కువ అవగాహన ఉందన్నారు. విద్యార్థి లోకం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందని కేటీఆర్ అన్నారు. `కోటి ఎకరాల మాగాణం కావాలనే సంకల్పంతో కాళేశ్వరం - పాలమూరు - సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుతున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నాం. తెలంగాణ మంచి ఆర్థిక ప్రగతిని సాధించింది` అని కేటీఆర్ వెల్ల‌డించారు.