Begin typing your search above and press return to search.

ఇదెక్కడి టార్గెట్ కేటీఆర్..నాలుగు రోజుల్లో ఐదుసార్లు వెళ్లాలా?

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:27 AM GMT
ఇదెక్కడి టార్గెట్ కేటీఆర్..నాలుగు రోజుల్లో ఐదుసార్లు వెళ్లాలా?
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పుర ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొత్త టార్గెట్ పెట్టారు. ఈ నెల 22న జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్ల వద్దకు అభ్యర్థులు నేరుగా వెళ్లాలని.. ఒక్కో అభ్యర్థి ప్రతి ఓటరు ఇంటికి కనీసం ఐదుసార్లు వెళ్లాల్సి ఉంటుందన్న టార్గెట్ ను పెట్టారు.

ప్రతి ఓటరు ఇంటికి ఐదుసార్లు వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని వివరించటం.. చేపట్టనున్న కార్యక్రమాల గురించి చెప్పటంతో పాటు.. ఓట్లు అడగాలని ఆయన ఆదేశించారు. వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అసాధ్యమంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. ఇలాంటి కండీషన్లు హైదరాబాద్ మహానగర శివారులో జరిగే పుర ఎన్నికల్లో మాత్రం సాధ్యం కాదంటున్నారు.

మహానగర శివారులో మొత్తం 14 మున్సిపల్.. కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్న రంగారెడ్డి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా దాదాపుగా 40 నుంచి 60 మంది ఓటర్లు ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో.. చాలా ఇళ్లకు తాళాల కప్పలు దర్శనమిస్తున్న పరిస్థితి. ఈ వారాంతానికి కానీ ఇళ్లకు రాని పరిస్థితి. ఇలాంటి వేళ.. రానున్న నాలుగు రోజుల్లో ఐదుసార్లు ఓటర్లను కలవాలన్న కేటీఆర్ మాటను ఆచరణలో ఏ మాత్రం సాధ్యం కాదంటున్నారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లుగా సాధ్యం కాదంటున్నారు. వెయ్యి నుంచి నాలుగు వేల కంటే తక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ.. ఒకట్రెండుసార్లు కలవటమే కష్టంగా ఉన్న వేళ.. అందుకు భిన్నంగా నాలుగు రోజుల్లో ఐదుసార్లు కలవాలన్న టార్గెట్ పూర్తి చేయటం అసాధ్యమని చెబుతున్నారు. ఇలాంటి సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయటం ద్వారా కేటీఆర్ తమ అభ్యర్థులను నిరాశలో ముంచేస్తున్నరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.