Begin typing your search above and press return to search.

జగన్ పాలన బాగుందన్న కేటీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు

By:  Tupaki Desk   |   13 Jan 2020 7:50 AM GMT
జగన్ పాలన బాగుందన్న కేటీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు
X
సంబంధం లేని రెండు తాళ్లకు ముళ్లు వేయటం కొన్ని మీడియా సంస్థలకు అలవాటే. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి.. వివాదంలోకి లాగే ప్రయత్నం చేయటం.. లేనిపోనివి అపాదించే లెక్కకు తనదైన శైలిలో భలేగా సమాధానం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇటీవల ఆస్క్ కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పాలన మీద పాజిటివ్ వ్యాఖ్య చేయటం తెలిసిందే.

అయితే.. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడిన కేటీఆర్ మాటల్ని పక్కదారి పట్టిస్తూ.. కొత్త అర్థాన్ని అపాదిస్తూ చేస్తున్న ప్రయత్నాల పై కేటీఆర్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సీఎం జగన్ ఆర్నెల్ల పాలన బాగుందన్న వ్యాఖ్య తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా?అని కేటీఆర్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో భలేగా బదులిచ్చారు.

తానేం చెప్పాను? అందుకు మీడియా ఎలా అర్థం చేసుకుందన్న విషయాన్ని చెప్పిన కేటీఆర్ మాటల్ని.. ఆయన మాటల్లోనే చెబితే.. జగన్ ఆర్నెల్ల పాలనను తానేమీ స్వాగతించలేదని.. ఆ మాటకు వస్తే తనను అడిగిన ప్రశ్న జగన్ పాలన ఎలా ఉందని భావిస్తున్నారంటే.. దానికి ప్రారంభం బాగుందని చెప్పానని స్పష్టత ఇచ్చారు.

ఇట్‌ హాజ్‌ బిగన్‌ వెల్‌ అని చెప్పా. వెల్‌ బిగన్‌ ఈజ్‌ హాఫ్‌ డన్‌.. జగన్‌ బాగా చేశారా? లేదా? అనేది ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు తెలుస్తుంది. అక్కడ పంచాయతీ, మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. పక్కనున్న హైదరాబాద్ లోనో.. తెలంగాణలోని మంత్రి ఏమనుకుంటున్నారన్నది సమంజసమైనది కాదన్నారు.

ఎక్కడో దూరం నుంచి చూస్తూ బాగుంది.. బాగాలేదన్న జడ్జిమెంట్లు ఇవ్వలేమని.. రాజకీయ నాయకుడిగా.. సాటి పార్టీకి చెందిన నాయకుడిగా.. వేరే ప్రభుత్వాన్ని పక్కనుండి చూస్తున్నాం కాబట్టి బాగానే ప్రారంభిచారని చెప్పానని.. దానికి తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఏం సంబంధం ఉంది? అని ప్రశ్నించారు. శంకరాచార్యులకు.. పీర్ల పండక్కి ఉన్నంత సంబంధం ఉంది దానికి.. దీనికి అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చారు. మొత్తంగా సంబంధం లేని తాళ్లను ముళ్లు వేసే పని మానుకోవాలన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎంత పొందిగ్గా చెప్పారో కదా?