Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఓ డిష్ వాష‌ర్‌..ఔను నేను నీలాగా కాదు

By:  Tupaki Desk   |   8 Sep 2018 9:00 AM GMT
కేటీఆర్ ఓ డిష్ వాష‌ర్‌..ఔను నేను నీలాగా కాదు
X
తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో మునుప‌టి కంటే ఎక్కువ‌గా అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు జోరు కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా రెండు పార్టీల మ‌ధ్యే పోరు అన్న వాతావ‌ర‌ణం స్ప‌ష్ట‌మైపోయిన నేప‌థ్యంలో..ఎన్నిక‌ల‌ను ఆహ్వానించిన టీఆర్ ఎస్‌...ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతున్నాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌ధ్య మాటల యుద్ధం జ‌రిగింది. మంత్రి కేటీఆర్ రాజకీయాలకు అనర్హుడని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించ‌గా ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివిధ అంశాల‌పై స్పందిస్తూ కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు యూఎస్‌లో గిన్నెలు కడిగేవాడని వ్యాఖ్యానించారు. వాళ్ల నాన్న చొరవ వల్లే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా...ఆయ‌న రాజ‌కీయాల‌కు అన‌ర్హుడ‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఔను...అమెరికాలో అంట్లు తోమేవాడినే అంటూ ట్వీట్ చేశారు. ``అమెరికాలో ఉండే ప్రతి ఇండియన్.. వారి పనులు వారే చేసుకుంటారు. మీ పప్పులా కాకుండా..నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపాను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ్‌ను ఉద్దేశించి.. `నీ మాదిరిగా ప్రజల సొమ్మును దోచుకోలేదన్నారు. నీ కారులో డబ్బులు తగలబడిన విషయం అందరికీ గుర్తుంది`` అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాగా, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉన్న‌త విద్యావంతుడు. కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌ల వ‌లే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు దూరంగా ఉండే వ్య‌క్తి. పైగా పీసీసీ చీఫ్‌గా కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఏంట‌ని పార్టీలోనే చ‌ర్చ‌ర జ‌రుగుతోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందే...ప్ర‌చారం మొద‌లుకాక‌ముందే...ఈ స్థాయిలో విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగితే...ఇక ప్ర‌చారం మొద‌లైతే చెవుల‌కు చిల్లులు ప‌డేలా నాయ‌కులు దుమ్మెత్తిపోసుకోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.