Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీఎం అని కేటీఆర్ చెప్పుడేంది?

By:  Tupaki Desk   |   25 Oct 2018 8:33 AM GMT
కేసీఆర్ సీఎం అని కేటీఆర్ చెప్పుడేంది?
X
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెలిస్తే.. ముఖ్య‌మంత్రి ఎవ‌రన్న ప్ర‌శ్న కూడా ప్ర‌శ్నేనా? అనుకోవ‌చ్చు. కానీ.. ఇప్పుడీ విష‌యం మీద సందేహం ప్ర‌జ‌ల కంటే కూడా టీఆర్ ఎస్ వ‌ర్గాల‌కు ఎక్కువగా ఉన్న‌ట్లుంది. అందుకే కాబోలు.. ఎప్పుడూ లేని విధంగా తాజాగా తాజా మాజీ మంత్రి కేటీఆర్ వివ‌ర‌ణ ఇస్తున్న వైనం క‌నిపిస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ గెలిస్తే కేసీఆరే ముఖ్య‌మంత్రి అంటూ ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. ఎందుకు ఇలాంటి ప‌రిస్థితన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌స‌మాధానం ల‌భిస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే ముఖ్య‌మంత్రి అన్న‌ది ప‌క్కాగా తెలిసిన విష‌య‌మే అయినా.. ముంద‌స్తు ఎన్నిక‌లు మొత్తం త‌న కొడుకు కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌టం కోస‌మేన‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మొద‌లు గ‌ల్లీ లీడ‌రు నోటి నుంచి వ‌స్తున్న ప‌రిస్థితి.

మ‌రో తొమ్మిది నెల‌లు అధికారంలో చేతిలో ఉన్నా.. దాన్ని పూర్తిగా వినియోగించ‌కుండా హ‌డావుడిగా ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. ఒక్కోసారి ఒక్కోర‌కంగా స‌మాధానం చెబుతున్న కేసీఆర్‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నింద‌లు వేస్తుంద‌ని.. కుట్ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని.. వాటికి జ‌వాలు ఇచ్చేందుకే తాము ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లు చెప్పారు.

కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో అయితే ఘాటు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చెప్ప‌లేని రీతిలో తిట్ల దండం అందుకుంటున్న వారు కూడా లేక‌పోలేరు. ఇలాంటి వారి నోటి నుంచి మొత్తంగా వ‌స్తున్న ప్ర‌శ్న‌.. అయ్యా.. కేసీఆర్‌గారు.. మీరిప్పుడు చెప్పింది బాగుంది.

ముంద‌స్తు ఎందుకో మాకు అర్థ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి ఏడాది త‌ర్వాత మ‌ళ్లీ ఇదే ర‌కంగా స‌వాళ్లు విసిరో.. కుట్ర‌లు చేశారో.. అప్పుడు కూడా ఇదే రీతిలో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వ‌స్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్య‌మ కాలంలో వాళ్లు స‌వాలు విసిరారు.. వీరు స‌వాలు విసిరారు కాబ‌ట్టి.. తెలంగాణ అంటే ఏమిటో చూపిస్తామ‌ని ఉప ఎన్నిక‌ల‌కు దిగ‌టం ఓకే. కానీ.. అదంతా గ‌డిచిపోయిన క‌థ‌. ఇప్పుడు తెలంగాణ వ‌చ్చింది. ఇప్పుడు కూడా పాత‌కాలం రాజ‌కీయాలు చెల్ల‌వు కేసీఆర్ అంటూ ఘాటుగా బ‌దులిస్తున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అస‌లు కార‌ణం ప్ర‌భుత్వం మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త మ‌రింత ముదిరిపోకుండా ఉండేందుకు.. ఎన్నిక‌లు గెలిచి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయితే.. లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి కేంద్ర రాజకీయాల మీద దృష్టి పెట్టేందుకు.. ఆ స‌మ‌యానికి కొడుక్కి సీఎం కుర్చీ అప్ప‌జెప్పేందుకు వీలుగా ముంద‌స్తు వ్యూహాన్ని కేసీఆర్ ఖ‌రారు చేశార‌న్న వాద‌న ప్ర‌జ‌ల్లోకి లోతుగా వెళ్లిపోయింది. దీంతో.. అధికార బ‌దిలీ కోస‌మే ముంద‌స్తు ఎన్నిక‌ల్ని తెచ్చార‌న్న ప్ర‌చారంతో వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రికే కేటీఆర్ మాట‌ల్లో తేడా రావ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. లేక‌పోతే.. టీఆర్ ఎస్ గెలిస్తే కేసీఆరే ముఖ్య‌మంత్రి అని కేటీఆర్ చెప్పాలా? ఆ మాట రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న‌పిల్లాడికి కూడా తెలీదా?