Begin typing your search above and press return to search.

కొండా సురేఖ దారెటు?

By:  Tupaki Desk   |   20 Sep 2018 10:50 AM GMT
కొండా సురేఖ దారెటు?
X
అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటిలా మారింది టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పరిస్థితి. 24 గంటల్లో టీఆర్ ఎస్ నుంచి సమాధానం రాకుంటే అంటూ ఘీకరించిన సురేఖ ఇప్పుడు రోజులు గడుస్తున్నా తన రాజకీయ ప్రయాణంపై నోరు విప్పడం లేదు. ఇటు టీఆర్ ఎస్ లో సీటు లేక.. అటు కాంగ్రెస్ లోకి పోలేక సురేఖ ఏం చేస్తోందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది..

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించేసి కార్యక్షేత్రంలోకి దిగేసింది. అభ్యర్థులంతా ప్రచారం చేసుకుంటుండగా.. సీనియర్లంతా గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నుంచి టికెట్ ఆశించిన సురేఖకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. తనకు పరకాల.. తన కూతురుకు వరంగల్ తూర్పు ఇవ్వాలని సురేఖ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం నడుమే.. కేసీఆర్ ఈమెకు ప్రస్తుత వరంగల్ తూర్పు సీటు కూడా ఇవ్వకపోవడంతో షాక్ అయ్యింది. ఊహించని ఈ పరిణామంపై టీఆర్ ఎస్ అధిష్టానంపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన సురేఖ.. తాను హైకమాండ్ కు లేఖ రాస్తున్నానని.. 24 గంటల్లో సమాధానం రాకుంటే నా తడాఖా చూపిస్తానని చెప్పుకొచ్చింది. కానీ 24 గంటలు కాస్తా.. రోజులయ్యాయి. కేసీఆర్ స్పందించలేదు. సురేఖ ఎత్తుగడ ఫలించలేదు.

ఇప్పుడు కొండా సురేఖ దారేంటి అనేది చర్చనీయాంశమైంది. కాంప్రమైజ్ అయ్యి టీఆర్ ఎస్ లోకి వద్దామని ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఇటీవలే వరంగల్ లో పర్యటించిన కేటీఆర్ చేసిన ప్రకటనతో సురేఖకు చుక్కెదురైంది. పార్టీని ధిక్కరించిన వాళ్లు ఎవరైనా.. సరే పరిగణలోకి తీసుకునేది లేదని కేటీఆర్ కుండబద్దలు కొట్టడంతో సురేఖకు టీఆర్ ఎస్ దారులు మూసుకుపోయినట్టేని భావిస్తున్నారు. దీంతో కొండా దంపతుల విషయంలో టీఆర్ ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు అర్థమవుతోంది. అటు ప్రెస్ మీట్ పెట్టి బెదిరించినా.. ఇటు కాంప్రమైజ్ అవుదామన్నా టీఆర్ ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి కొండా దంపతులు పునరాలోచనలో పడ్డారట..

మరో వైపు వరంగల్ తూర్పు విషయంలో టీఆర్ ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య - మాజీ ఎంపీ గుండు సుధారాణితోపాటు వరంగల్ మేయర్ నరేందర్ కూడా టికెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురి ప్రయత్నాల నేపథ్యంలో అసలు కొండా సురేఖను టీఆర్ ఎస్ పట్టించుకోదని కార్యకర్తలు చెబుతున్నారట.. ఈ మొత్తం పరిణామాలు కొండా సురేఖకు శాపంగా మారాయి. ఆమె రాజకీయ జీవితం ఎటు వైపు వెళ్తుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.