Begin typing your search above and press return to search.

జానా - భ‌ట్టి - రేవంత్‌ పై కేటీఆర్‌ కు ఇంత క్లారిటీ ఉందా?

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:16 AM GMT
జానా - భ‌ట్టి - రేవంత్‌ పై కేటీఆర్‌ కు ఇంత క్లారిటీ ఉందా?
X
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌లు పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న కొద్ది ఆయా రాజ‌కీయ పార్టీలు త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఒక్కోపార్టీ ఒక్కో రీతిలో త‌మ‌దైన శైలిలో ఎదుటి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. త‌మ స‌త్తాను చాటుకునేలా ఎదురుదాడిని కొనసాగిస్తున్నాయి. ఈ ప‌రంప‌రంలో టీఆర్ ఎస్ పార్టీ నేత‌ - మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న‌ జోస్యం చెప్పారు. త‌మ పార్టీ బ‌లాబ‌లాల గురించి విశ్లేషిస్తూనే...త‌మ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ ముఖ్య నేత‌ల గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. టీఆర్ ఎస్‌ కు చెందిన అగ్ర‌నేత‌లు ఈ ద‌ఫా ఓట‌మి ఖాయ‌మ‌ని ఢంకా బ‌జాయించి మ‌రీ కేటీఆర్ వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

హైద‌రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌ లో టీఆర్ ఎస్ పార్టీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓటమి భయంతోనే రేవంత్ డ్రామాలు మొదలు పెట్టాడని విమర్శించారు. కొడంగల్ లో గెలవలేక ఎన్నికలను వాయిదా వేయించాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తూన్నారని ఆరోపించారు. రేవంత్ స‌హా కాంగ్రెస్‌ కు చెందిన ముఖ్య‌నేత‌లు రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు కానున్నార‌ని కేటీఆర్ వెల్ల‌డించారు. నాగర్జునసాగర్‌ లో తాజా మాజీ సీఎల్పీ నేత‌ జానారెడ్డి - కొడంగల్‌ లో రేవంత్ రెడ్డి - మధిరలో టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ వెల్ల‌డించారు. కాంగ్రెస్ నేత‌ల‌కు త‌మ ఓట‌మి గురించి ముందే తెలిసిపోయింద‌ని అందుకే నియోజ‌క‌వ‌ర్గం దాటి బ‌య‌ట అడుగుపెట్ట‌డం లేద‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇక కీల‌క‌మైన గ్రేటర్ హైదరాబాద్ గురించి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన లెక్క‌లు చెప్పారు. గ్రేట‌ర్‌ లో 17స్థానాలు టీఆర్ ఎస్ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేన‌ని, కాంగ్రెస్ ఒక్క‌చోట కూడా గెల‌వ‌డం లేద‌ని తెలిపారు. మహిళలు - ముస్లింలు పూర్తిగా టీఆర్ ఎస్ వైపే ఉన్నారని వెల్లడించారు. సెటిలర్లంతా కారు వైపే ఉన్నారని స్పష్టం చేశారు. శేర్‌ లింగంపల్లి - కూకట్ పల్లి - కుత్బుల్లాపూర్‌ ల‌లో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఎంత తాపత్రయపడ్డా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుగుతానని కేటీఆర్‌ వెల్లడించారు. అక్కడా రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచే స్థానాలను బట్టి మా వ్యూహం ఉంటుందని వెల్లడించారు. చివరి రోజున ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేసుకుంటారని తెలిపారు. సిరిసిల్లలో ఈ సారి కూడా 50 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.