Begin typing your search above and press return to search.

ఉత్తమ్ ను ట్రక్కే కాపాడిందన్నట్టు.?

By:  Tupaki Desk   |   5 Jan 2019 5:38 AM GMT
ఉత్తమ్ ను ట్రక్కే కాపాడిందన్నట్టు.?
X
సునామీ వచ్చినా.. భూకంపం వచ్చినా ఆపలేము.. అలాగే ప్రజల ఆంకాంక్షలను కూడా ఎవ్వరూ తొక్కిపెట్టలేరు.. గడిచిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బలంగా కోరుకున్నారు కాబట్టే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. హేమాహేమీలైన జానారెడ్డి - కోమటిరెడ్డి - రేవంత్ రెడ్డి - డీకే అరుణ లాంటి వాళ్లు టీఆర్ ఎస్ గాలిలో కొట్టుకుపోయారు. ప్రజలందరూ తండోపతండాలు వచ్చి మరీ కారు గుర్తుకు ఓటేశారు.. ఆ మధ్య బండ్ల గణేష్ పోలింగ్ కేంద్రం ముందు బారులు తీరిన ఓటర్లను చూసి అదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనుకున్నాడట.. కానీ వారు టీఆర్ ఎస్ గెలిపించడానికి కంకణం కట్టుకొని వచ్చారని అనుకోలేదని ఎన్నికల తర్వాత వాపోయారు..

ఇలా వ్యతిరేకతలోనూ.. అభిమానం చూపడంలోనూ ప్రజలు నిస్వార్థంగా వ్యవహరిస్తారని చెప్పకతప్పదు. మంచి చేస్తే నాయకులను నెత్తిన పెట్టుకుంటారు.. పనిచేయకపోతే తొక్కిపడేస్తారనడానికి తెలంగాణ ఎన్నికలు గొప్ప ఉదాహరణ. తాజాగా కేటీఆర్ కూడా ఇదే చెప్పాడు. గెలిచామని గర్వపడవద్దని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించాడు.

ఇక టీఆర్ఎస్ ప్రభంజనంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా కొట్టుకుపోయేవాడని హూజూర్ నగర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. హుజూర్ నగర్ లో చివరి రౌండ్ వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుకబడ్డాడు. చివరి మూడు రౌండ్లలోనే 8300 మెజార్టీతో గట్టెక్కారు. నిజానికి అక్కడ ట్రక్కు గుర్తుకు ఎక్కువ పడడంతోనే ఉత్తమ్ గెలిచాడు. ఆ ట్రక్కు గుర్తు లేకపోతే టీఆర్ ఎస్ అభ్యర్థి గెలిచేవాడట.. కానీ అదృష్టం బాగుండి టీఆర్ ఎస్ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు అటు పడ్డాయి. ఉత్తమ్ కు వచ్చిన మెజార్టీ ఓట్లు ట్రక్కుకు పడ్డాయి ఇక్కడ. అందుకే గెలిచారని కేటీఆర్ వివరించారు. ఇప్పుడు పంచాయతీ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీచేసే అవకాశం లేదని.. అంతా ఏకగ్రీవాలు, గులాబీ గుభాళింపు ఉండాలని కేటీఆర్ వివరించారు.

ఈ వ్యాఖ్యలతో ఉత్తమ్ ను కూడా జనాలు దాదాపు ఓడగొట్టినట్టేనని కేటీఆర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ట్రక్కు గుర్తు లేకుంటే ఉత్తమ్ కూడా ఓడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకునేవారు. అందుకే ఆ ట్రక్కును తొలగించాలని స్వయంగా కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి వివరించారు.