Begin typing your search above and press return to search.

మూడు ఎన్నిక‌లు...ముగ్గురు నాయ‌కులు

By:  Tupaki Desk   |   23 Feb 2016 5:30 PM GMT
మూడు ఎన్నిక‌లు...ముగ్గురు నాయ‌కులు
X
తెలంగాణ‌లో కొన‌సాగుతున్న వ‌రుస ఎన్నిక‌ల జోరులో తాజాగా వ‌చ్చిచేరిన వ‌రంగ‌ల్‌ - ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ పోరు మరింత హీట్ పెంచింది. కారు జోరు కొనసాగుతున్న సమయంలో ప్రతిప‌క్షాలు ఆ దూకుడు బ్రేక్ వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. అయితే వాటి కంటే ముందు త‌మ గెలుపు జోష్‌ ను తారాస్థాయికి చేర్చేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి, గులాబీ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఈ మూడు ఎన్నిక‌ల‌ను పార్టీలోని ముగ్గురు నాయ‌కుల‌కు అప్ప‌జెప్పే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మే. ఉద్య‌మ కాలం నుంచి వ‌రంగ‌ల్‌ లో పెద్ద ఎత్తున టీఆర్ ఎస్‌ కు క్యాడ‌ర్ ఉండ‌గా...ఇటీవ‌లి కాలంలో కీల‌క‌ నాయ‌కులు పార్టీలో చేరారు. తాజాగా చేరిన టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావుతో పాటు పార్టీలో ఇప్ప‌టికే ఉన్న డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హరి - సీనియ‌ర్ ఎమ్మెల్యే కొండా సురేఖ‌ - మాజీ డిప్యూటీ సీఎం టి.రాజ‌య్య వంటి నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం అంత తేలికేం కాద‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ సీనియ‌ర్ మెంబ‌ర్లు మొద‌లుకొని ప్ర‌స్తుతం చేరిన వారిని స‌మ‌న్వ‌యప‌ర్చేందుకు హ‌రీశ్‌ రావు స‌రైన వ్య‌క్తి అని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో హ‌రీశ్‌ కు వ‌రంగ‌ల్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తార‌ని పేర్కొంటున్నారు.

ఇక ఖ‌మ్మం పుర‌పాలిక విష‌యానికి వ‌స్తే సెటిల‌ర్లు - సీమాంధ్రులు ఎక్కువ‌గా ఉన్న ఈ కార్పొరేష‌న్‌ లో గెలుపు బాధ్య‌త‌ను త‌న త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కు కేసీఆర్‌ అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. మంత్రి తుమ్మ‌ల‌తో క‌లిసి గ్రేట‌ర్ ఎన్నిక‌ల సమ‌యంలో కేటీఆర్ స‌మ‌న్వ‌యం చేసుకొని సీమాంధ్రులు, సెటిల‌ర్ల ఓట్ల‌ను కారు గుర్తుపై ప‌డేలా చేయ‌డంలో విజ‌యం సాధించిన‌ట్లే... ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ లో వీరి జోడి బాగుంటుంద‌ని కేసీఆర్ మ‌దిలో ఉన్న‌ట్లు చెప్తున్నారు. ఇక అచ్చంపేట న‌గ‌ర పంచాయ‌తీకి ఎంపీ క‌వితకు బాధ్యురాలిగా చేస్తార‌ని అంచ‌నావేస్తున్నారు. గ‌తంలో ఆదివాసీల స‌మ‌స్య‌ల‌పై పోరాడిన సంద‌ర్భంతో పాటు వెన‌క‌బ‌డిన పాల‌మూరులో టీఆర్ ఎస్‌ ను బ‌లోపేతం చేసేందుకు క‌విత స‌రైన నాయ‌కురాలిగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రాథ‌మిక స్థాయిలో టీఆర్ ఎస్ అగ్ర‌నేత‌ల ప‌రిశీల‌న ఉన్న ఈ బాధ్య‌త‌ల అప్ప‌గింత‌పై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సింది కేసీఆర్ అనేది అంద‌రికీ తెలిసిందే. అయితే వ్యూహ‌క‌ర్త‌గా పేరున్న కేసీఆర్ ఈ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల విష‌యంలో ఎలాంటి అడుగు వేస్తారో చూడాలి మ‌రి.