Begin typing your search above and press return to search.

కసరత్తు ఎప్పుడో మొదలైనా? జాబితా రిలీజ్ కాలేదేం కేటీఆర్?

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:30 AM GMT
కసరత్తు ఎప్పుడో మొదలైనా? జాబితా రిలీజ్ కాలేదేం కేటీఆర్?
X
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అధికారపక్షం చాలా నెలల ముందు నుంచే కసరత్తు షురూ చేసింది. ఇదెంత భారీగా జరిగిందన్న విషయానికి ఒక్క ఉదాహరణ చెప్పాలంటే.. గ్రేటర్ బరిలో దింపే పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏకంగా ఐదు అంచెల విధానాన్ని అనుసరించారు. అంటే.. ఐదు వేర్వేరు సర్వేలు నిర్వహించి.. అభ్యర్థుల తీరు.. పార్టీకి ఉన్న గెలుపు అవకాశాల్ని మదింపు చేశారు. దాదాపు ఏడాది ముందు నుంచి కసరత్తు మొదలైనా.. కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఆర్నెల్లు ఆగింది. మళ్లీ మొదలైంది.

ఈ రిపోర్టుల ఆధారంగానే పది నుంచి ఇరవై సీట్లలో మార్పులు ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ సిద్ధమైంది కూడా. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో అనుకున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే తెలంగాణ అధికారపక్షం అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదని చెబుతారు.

కసరత్తు ఎప్పుడో మొదలెట్టి.. అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవటానికి కారణం.. రెబెల్స్ ముప్పు లేకుండా చేసుకోవటమేనని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నిన్న (మంగళవారం) విడులైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు (బుధవారం) నుంచి మొదలై.. శుక్రవారం సాయంత్రం నాటికి ముగియనుంది. అంటే.. కేవలం మూడు రోజుల మాత్రమే. ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి. అలా చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ఈ రోజు యాభై నుంచి అరవై మంది వరకు.. గురువారం మరికొందరిని ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఏ స్థానాల్లో అయితే కొత్తగా అభ్యర్థుల్ని దించాలని అనుకుంటున్నారో.. ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఇలా ఎందుకంటే.. టికెట్ రాని అభ్యర్థులు పార్టీ మారేందుకు అవకాశం లేకుండా చేయటమే లక్ష్యమంటున్నారు. ఒకవేళ.. పార్టీ మారే ప్రయత్నం చేసినా.. అవతల పార్టీకి ఆలోచించుకునే అవకాశం లేకుండా చేయటమే అసలు ప్లాన్ గా చెబుతున్నారు. ఈ కారణంతోనే.. అభ్యర్థుల ఎంపిక లెక్కలు ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించటం లేదని చెబుతున్నారు.