Begin typing your search above and press return to search.

హైదరాబాదీల విషయంలో కేటీఆర్ కీలక నిర్ణయాలు

By:  Tupaki Desk   |   6 Oct 2020 3:30 AM GMT
హైదరాబాదీల విషయంలో కేటీఆర్ కీలక నిర్ణయాలు
X
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో హైదరాబాదీలను ఆకట్టుకునే దిశగా తెలంగాణ సర్కార్ పలు వరాలు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని.. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా హైదరాబాద్ లో కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు 5 లక్షల 80వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 10 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులతోపాటు పట్టణీకరణలో భాగంగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

జీహెచ్ఎంసీలో నూతన ఫ్లై ఓవర్లు, రోడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్అన్నారు. పార్కులు, చెరువులు, బస్తి దవాఖానా, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని.. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు చేశారు.

సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ కలిసి పనిచేయాలని సూచించారు.