Begin typing your search above and press return to search.

రెచ్చిపొమ్మంటోన్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   8 Sept 2021 12:11 PM IST
రెచ్చిపొమ్మంటోన్న కేటీఆర్‌
X
రాజ‌కీయాల్లో రాణించాలంటే ప్ర‌జ‌లను ఆక‌ర్షించాలంటే నాయ‌కుల‌కు గొప్ప వాగ్ధాటి అవ‌స‌రం. జ‌నాల‌ను మాట‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డంలోనే నేత‌ల భ‌విష్య‌త్ దాగి ఉంటుంది. ప్రతిప‌క్షంలో ఉంటే.. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌దునునైన విమ‌ర్శ‌లు చేయాలి. అదే అధికారంలో ఉన్న పార్టీ.. ప్ర‌త్యర్థి పార్టీల‌కు దీటైన స‌మాధానం ఇవ్వాలి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఇదే దిశ‌గా మ‌రింత వేగంగా అడుగులు వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్ఎస్‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ పార్టీ శ్రేణుల‌తో స‌మావేశంలో ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

2014లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌.. రాష్ట్రంలో మ‌త పార్టీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే స‌రైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు లేకుండా చూసుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యార‌నే టాక్ ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని కీల‌క నాయ‌కుల‌కు టీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఆయ‌న త‌న‌కు ఎద‌రులేకుండా చేసుకున్నారు. టీడీపీ పూర్తిగా ప‌ట్టు కోల్పోగా.. ఇక కాంగ్రెస్‌లో ఉన్న సీనియ‌ర్లు కూడా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా గ‌ట్టిగా త‌మ స్వ‌రాన్ని వినిపించ‌లేక‌పోయారు. కానీ గ‌త రెండేళ్లుగా రాష్ట్రంలో ప‌రిస్థితి మారింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపికైన బండి సంజ‌య్ దూకుడుతో కేసీఆర్‌కు ఎదురు నిలుస్తున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేసే దిశ‌గా సాగుతున్నారు. ఇక ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు కొత్త‌గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల‌, త‌న ఉద్యోగానికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ప్ర‌వీణ్ కుమార్‌.. ఇలా వీళ్లంద‌రి ల‌క్ష్యంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి ఎలాగో కొన‌సాగుతోంది. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోవైపు నుంచి కేసీఆర్‌కు స‌వాలు విసురుతూనే ఉన్నారు. అలా అన్ని వైపుల నుంచి టీఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టారు. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ నేత‌లు కూడా సైలెంట్‌గా ఉండాల్సిన అస‌వ‌రం లేద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల మాట‌ల‌కు త‌గిన రీతిలో స‌మాధానం ఇవ్వాల‌ని కేటీఆర్ తాజాగా త‌మ నేత‌ల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇటీవ‌ల రేవంత్ రెడ్డి త‌న‌పై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు టీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి స్పందించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. నోటికొచ్చినొట్లు రేవంత్‌పై మాట‌ల దాడి చేసిన మ‌ల్లారెడ్డి.. ద‌మ్ముంటే రేవంత్ రాజీనామా చేసి త‌న‌తో పోటీకి దిగాల‌ని తొడ‌గొట్టి మ‌రీ స‌వాలు చేశారు. మ‌ల్లారెడ్డి వ్యాఖ్య‌ల‌ను అప్పుడు కేటీఆర్ కూడా వెన‌కేసుకొచ్చారు. ప్ర‌త్య‌ర్ఙి పార్టీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటూ చూస్తూ కూర్చోవాలా? మ‌ల్లారెడ్డి ఎప్పుడూ జోష్‌లో ఉంటారు కాబ‌ట్టి అలా మ‌ట్లాడార‌ని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు తాజా స‌మావేశంలోనూ మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కేసీఆర్ లాంటి ఎంతో అనుభవం ఉన్న నాయ‌కుడిని నానా మాట‌లు అంటుంటే మ‌నం త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని ఊరుకోకుండా ఉండ‌కూడ‌ద‌ని మాట‌ల‌తో రెచ్చిపోవాల‌ని కేటీఆర్ సూచించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ సైలెంట్‌గా ఉంటే పార్టీపై ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు అభిప్రాయం క‌లిగే అవ‌కాశం ఉంద‌నే ఉద్దేశంతోనే కేటీఆర్ ఇప్పుడు త‌మ పార్టీ నేత‌ల‌కు ఇలాంటి సూచ‌న‌లు చేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.