Begin typing your search above and press return to search.

ఎక్కడ తగ్గాలో తెలిసినోడే కేటీఆర్

By:  Tupaki Desk   |   10 Feb 2018 12:12 PM GMT
ఎక్కడ తగ్గాలో తెలిసినోడే కేటీఆర్
X
రాజకీయాల్లో, పాలనలో అనుభవం అపారంగా లేకపోయినా వ్యవహార దక్షతలో మాత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్ ను మించినవారు లేరనే చెప్పాలేమో. ఎవరిని విమర్శించాలి.. ఏ స్థాయిలో విమర్శించాలి.. ఎవరి వద్ద ఎలా ఉండాలి.. ఏ సందర్భంలో ఎలా ఉండాలన్నది మాత్రం ఇతర యువ నేతలంతా కేటీఆర్ నుంచే నేర్చుకోవాలి. ఎన్నికలప్పుడు చంద్రబాబును ఎంతగా విమర్శిస్తారో ఆయన్న ఏదైనా ప్రపంచ వేదికలపై కలిసినప్పుడు అంతగా ఆత్మయంగా వ్యవహరిస్తారు కేటీఆర్. ఇతర నేతలతోనూ అంతే. తాజాగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును కలిసిన ఆయన ఆ సందర్భంలో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వారిద్దరి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలిసిన కేటీఆర్ ఆయన ముందు చేతులు కట్టుకుని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వినడం అందరినీ ఆకట్టుకుంటోంది. పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 11వ తేదీ మధ్య హైదరాబాదులో "వింగ్స్ ఇండియా 2018" పేరిట అంతర్జాతీయ సదస్సు - ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అశోక్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్ధరి మధ్య సంభాషణల సమయంలో అశొక్ చెప్పే మాటలను కేటీఆర్ శ్రద్ధగా - బుద్ధిగా ఒక విద్యార్థికి మళ్లే చేతులు కట్టుకుని మరీ విన్నారు.

కేటీఆర్... అశోక్ కు అంతగా గౌరవం ఇవ్వడానికి కారణాలున్నాయి. విజయనగర రాజ వంశీకుడైన అశోక్ ప్రస్తుత తరానికి చెందిన క్లీన్ లీడర్లలో ఒకరు. జన్మత: తనకు ఉన్న స్థాయితో కానీ, ప్రస్తుతం పదవుల పరంగా ఉన్న అధికారంతో కానీ సంబంధం లేకుండా అత్యంత సామాన్యంగా ఒక సాధారణ వ్యక్తిలా జీవించే ఆయన పద్ధతి కూడా ఎవరైనా ఆయన్ను గౌరవించేలా చేస్తుంది. వీటితో పాటు రాజకీయంగా చూసుకున్నా కేటీఆర్.. అశోక్ పట్ల కృతజ్ఞత చూపాల్సిన పరిస్థితులున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నిత్యం చంద్రబాబును టీఆరెస్ నేతలు విమర్శిస్తుంటారు. ఇలాంటి తరుణంలో అశోక్ కనుక అనుకుంటే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును హైదరాబాదులో కాకుండా ఇంకెక్కడైనా నిర్వహించొచ్చు. కానీ, హైదరాబాద్ ప్రాధాన్యం దృష్ట్యా అశోక్ ఈ సదస్సుకు ఆ నగరాన్నే ఎంచుకున్నారు. అందుకే... ‘వింగ్స్ ఇండియా 2018' సదస్సు కోసం విమానయాన శాఖ హైదరాబాదును వేదికగా చేసుకున్నందుకు అశోక్ గజపతికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. వ్యక్తిత్వంపరంగా - రాజకీయంగా కూడా ఉన్నతుడు కావడంతో కేటీఆర్ అశోక్ ముందు వినయం ప్రదర్శించి తన గొప్పతనాన్నీ చాటుకున్నారు.