Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోటి వెంట ఆణిముత్యం లాంటి మాట

By:  Tupaki Desk   |   12 Feb 2018 8:09 AM GMT
కేటీఆర్ నోటి వెంట ఆణిముత్యం లాంటి మాట
X
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చేసే విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఓవైపు.. మ‌రోవైపు ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా కేంద్ర‌మంత్రుల‌తో భేటీల‌తో పాటు.. హైద‌రాబాద్ లో ఉన్న రోజుల్లో అత్య‌ధికం హైద‌రాబాద్ లోని ఏదో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టం.. చాలా సంద‌ర్భాల్లో రెండుకు పైనే కార్య‌క్ర‌మాల్లో హాజ‌ర‌య్యే తీరు మంత్రి కేటీఆర్ లో క‌నిపిస్తుంది.

ఐటీ శాఖామంత్రిగా ఇప్ప‌టికే త‌న స‌త్తా చాటుకున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ముఖాన్ని మార్చే విష‌యంలో మాత్రం ఆయ‌న త‌డ‌బాటు స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉంది. మ‌హాన‌గ‌రం రోడ్ల‌తో పాటు.. డ్రైనేజీ.. వాట‌ర్ విష‌యంలో కేటీఆర్ త‌న‌దైన ముద్ర‌ను చూపించ‌లేక‌పోయార‌ని చెప్పాలి.

అన్నింటికి మించి రోడ్ల విష‌యంలో కేటీఆర్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యార‌న్న విమ‌ర్శ వినిపిస్తూ ఉంటుంది. త‌న‌ను క‌లిసిన ఉన్న‌తాధికారుల వ‌ద్ద కేటీఆర్ సైతం.. హైద‌రాబాద్ రోడ్ల విష‌యంలో ఫెయిల్ అయ్యామ‌న్న అసంతృప్తితో పాటు.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తార‌ని చెబుతారు. అలా అని ఆ మాట‌ల్ని ఓపెన్ గా చెబితే.. విప‌క్షాలు బంతాట ఆడుకుంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అందుకే.. తాను వెళ్లిన చోట హైద‌రాబాద్ గురించి వీలైనంత గొప్ప‌లు చెప్పుకోవ‌టం కేటీఆర్ లో క‌నిపిస్తూ ఉంటుంది.

తాజాగా సిటీలో ప‌ర్య‌టిస్తూ.. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్‌.. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ గురించి చాలానే మాట‌లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా హైద‌రాబాద్‌ ను 400 యూనిట్లుగా చేశామ‌న్న ఆయ‌న‌.. త‌డి-పొడి చెత్త వేరు చేసేందుకు 45 ల‌క్ష‌ల చెత్త‌బుట్ట‌లు పంపిణీ చేసిన‌ట్లు చెప్పారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం బాగుంటే.. మ‌నం బాగుంటామ‌న్న ఆణిముత్యం లాంటి మాట‌ను చెప్పిన కేటీఆర్‌.. హైద‌రాబాద్ భాగ‌స్వామ్యం లేకుంటే ఏమీ చేయ‌లేమ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ కేటీఆర్ మాటే నిజ‌మ‌నుకుంటే.. ఎవ‌రికీ సాధ్యం కాద‌న్న విద్యుత్ కొర‌త అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ స‌ర్కారుకు.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర స‌మ‌స్య‌ల్లో ముఖ్య‌మైన రోడ్ల లెక్క‌ను తేల్చ‌టం క‌ష్ట‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌. హైద‌రాబాద్ బాగుంటే అంతా బాగుండ‌ట‌మే నిజ‌మైతే.. హైద‌రాబాద్ స‌మ‌స్య‌ల‌పై కేటీఆర్ అండ్ కో స‌మ‌ర‌శంఖాన్ని ఎందుకు పూరించ‌లేక‌పోయార‌న్న ప్ర‌శ్న న‌గ‌ర జీవుల్లో వెంటాడుతోంది. సినిమాటిక్ మాట‌ల్ని చెప్పే క‌న్నా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కేటీఆర్ కృషి చేస్తే.. హైద‌రాబాదీయులు ఆయ‌న్ను నెత్తిన పెట్టుకుంటార‌న్న‌ది అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.