Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కాళ్లు..హైద‌రాబాద్‌ లో క‌న్నీళ్లు!

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:27 PM GMT
ఢిల్లీలో కాళ్లు..హైద‌రాబాద్‌ లో క‌న్నీళ్లు!
X
పనిచేసే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదని - ఎందుకీ చిన్నచూపు అని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు తెలంగాణ ఐటీ - పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. టీఎస్‌ ఐపాస్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదాపూర్ శిల్పకళావేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... పారిశ్రామిక రంగంతో పాటు - రక్షణ రంగంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తోంద‌న్నారు. పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాయని - కానీ దురదృష్టవశాత్తు అలా జరగడంలేదని చెప్పారు. దీనిపై, తెలంగాణ‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

దక్షిణాదిని భాతర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలంగాణ‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్ప‌ష్టం చేశారు. విభజన రాజకీయాలు చేయటం తండ్రి కొడుకుల(కేసీఆర్ - కేటీఆర్)కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ఢిల్లీలో కాళ్ళు.. హైద‌రాబాద్ లో కన్నీళ్ళు అన్నట్టు.. తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల‌ను రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వంపై ట్విట్టర్ పిట్ట‌.. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ర‌క్షణశాఖ భూములను కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయిందని - ఆ భూములను ఇవ్వటం‌ కుదరదన్నందుకే... కేంద్రంపై కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నాడన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నాడన్నారు. కేంద్రం నిధులను టీఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దలు దారి మళ్ళించారన్నారు. కేంద్ర నిధులపై శాఖల వారీగా కేటీఆర్ తో చర్చకు సిద్ధమని చెప్పారు.

ధనిక రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దివాలా తీయించారని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిర్భయ నిధిని కూడా ఖర్చు చేయలేని స్థితిలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిగిన టీఆర్ ఎస్.. నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైందని లక్ష్మణ్ ఆరోపించారు. దక్షిణాది కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఎటుపోయిందో.. కేటీఆర్ చెప్పాలన్నారు.