Begin typing your search above and press return to search.

దేశంలో ప్రాణాల‌కు విలువ లేదు:కేటీఆర్

By:  Tupaki Desk   |   28 April 2018 10:20 PM IST
దేశంలో ప్రాణాల‌కు విలువ లేదు:కేటీఆర్
X
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలు...`విజ‌న్ ఫ‌ర్ ఎ బెట‌ర్ టుమారో` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్రమంలో భాగంగా `భ‌ర‌త్ అనే నేను` సినిమాలోని అసెంబ్లీ స‌న్నివేశంపై కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. దీంతోపాటు అనేక సామాజిక విష‌యాల‌పై కేటీఆర్ త‌న‌దైన శైలిలో మాట్లాడారు. మ‌నం అసెంబ్లీలో హీనంగా బ్ర‌తుకుతున్నాం అని మహేష్ అన‌గానే ప‌క్క‌నెవ‌రో లేచి అంత‌మాటంటారేమిటని ప్ర‌శ్నిస్తార‌ని.....వాస్త‌వంగా నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ దేశంలో ప్రాణాల‌కు విలువ లేదని...ఒక‌రంటే ఒక‌రికి గౌర‌వం లేదని కేటీఆర్ అన్నారు. ఒక అంబులెన్స్ కు తోవ ఇచ్చే సంస్కారం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ సినిమాలో చూపిన‌ట్లు....ఇక ట్రాఫిక్ సెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వివిధ దేశాల అల‌వాట్ల‌ను, అక్క‌డి నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను చూస్తున్నామ‌ని...వారు కూడా మ‌నుషులేన‌ని....కానీ వాళ్ల‌లా మ‌నం బ్ర‌త‌క‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్ల‌యింద‌ని,...రెండు అణుబాంబులు వేయించుకున్న జ‌పాన్ మ‌న‌క‌న్నా ఎక్కువ అభివృద్ధి చెందింద‌ని అన్నారు. పౌరుల‌కు స్వీయ నియంత్రణ ఉండాల‌ని, అన్నీ ప్ర‌భుత్వ‌మే చేయ‌డం ఎక్క‌డా సాధ్యం కాద‌ని అన్నారు. హైద‌రాబాద్ లో కోటి మంది జ‌నాభాకు...20 వేల పారిశుధ్య సిబ్బంది మాత్ర‌మే ఉన్నార‌ని, కాబ‌ట్టి...పౌరులు కూడా ప‌రిసరాల శుభ్ర‌త‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

తాను టోక్యోలో ప‌ర్య‌టించిన‌పుడు అక్క‌డి రోడ్ల‌ను , ప‌రిస‌రాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని కేటీఆర్ చెప్పారు. అస‌లు తాము రోడ్ల‌పై చెత్త వేయమ‌ని...అందుకే రోడ్లు ఇలా ఉన్నాయ‌ని తన మిత్రుడు చెప్పార‌ని అన్నారు. పౌరులు తమ ఇంటిని శుభ్ర ప‌రిచిన‌ట్లే స‌మాజం కూడా శుభ్రంగా ఉండాల‌ని అక్క‌డి వారు భావిస్తార‌ని చెప్పారు. త‌న కూతురుకు ఐదేళ్లునపుడు సింగ‌పూర్ తీసుకెళ్లాన‌ని, అక్క‌డ చాక్లెట్ తిని రేప‌ర్ రోడ్డు మీద వేస్తే...జైల్లో వేస్తార‌ని లేదా 500 డాల‌ర్లు ఫైన్ వేస్తార‌ని చెప్పాన‌ని కేటీఆర్ అన్నారు. ఆ త‌ర్వాత సింగ‌పూర్ లో ఉన్న వారం రోజులు...రేప‌ర్ల‌ను డ‌స్ట్ బిన్ లో లేదా త‌న పాకెట్ లో పెట్టుకుంద‌ని ...చిన్న‌ప్ప‌టినుంచి పిల్ల‌ల‌కు ప‌రిస‌రాల శుభ్ర‌త‌ను అల‌వాటు చేయాల‌ని అన్నారు. ఇప్ప‌టికే శివ‌గారు చాలా సందేశాత్మ‌క చిత్రాలు తీశార‌ని, మ‌హేష్ లాంటి స్టార్ల‌తో ప‌రిస‌రాల శుభ్ర‌త‌తో పాటు మరికొన్ని మెసేజ్ ల‌ను చెప్పించ‌డం ద్వారా జ‌నాలకు ఎక్కువగా రీచ్ అవుతుంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌హేష్ బాబు న‌టించే ప్ర‌తి సినిమాలో ఏదో ఒక చిన్న సందేశం...ఉండేలా చూడాల‌ని కోరారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.