Begin typing your search above and press return to search.

తెలంగాణ పర్యటనకు రావటం కాదు.. రూ.10వేల కోట్లు తెస్తున్నావా అమిత్ షా?

By:  Tupaki Desk   |   17 Sep 2022 3:42 AM GMT
తెలంగాణ పర్యటనకు రావటం కాదు.. రూ.10వేల కోట్లు తెస్తున్నావా అమిత్ షా?
X
ఇటీవల కాలంలో కేంద్రంపై తరచూ ఏదో ఒక విమర్శ చేసే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి తన విచిత్ర వాదనను వినిపించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన/విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. తాజాగా సిరిసిల్లలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. అమిత్ షా రూ.10వేల కోట్లను తనతో తెలంగాణకు తెస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ చెమట.. రక్తంతో కట్టిన పన్నులతో కులుకుతూ.. ఉత్తరప్రదేవ్.. గుజరాత్ లకు ఖర్చు చేస్తున్నారంటూ మండి పడిన ఆయన.. ‘సొమ్ము ఒకడిది.. సోకు కేంద్రానిది’ అంటూ మండిపడ్డారు. దేశమంతా ఉచిత విద్య.. వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని. ఆ బిల్లును పార్లమెంటులో పెట్టే దమ్ము కేంద్రానికి ఉందా? అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్.. కేంద్రాన్ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

మోడీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోయిందని.. ఆయన పాలనలో నైజీరియా కంటే అత్యదిక పేద దేశంగా ఇండియా మారిందన్నారు. దేశం డెవలప్ మెంట్ సంగతి మరిచి.. యువతలోమత విద్వేషాల బీజాలు నాటుతున్నాడని.. మోసం చేస్తున్నారన్నారు. టీం ఇండియా.. సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేద్దామంటూ అందమైన మాటలు చెబుతున్నారని.. చేతలు వేరేలా ఉన్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమైక్య వజ్రోత్సవ కార్యక్రమాలకు పోటీగా సమావేశాలు పెట్టటం ఎందుకు? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు.. కేంద్ర హోం మంత్రి వస్తున్నారన్నారు. మాట్లాడితే.. హిందూ.. ముస్లిం, పాకిస్థాన్ తప్పించి మరింకేమీ లేదన్నారు. మతపిచ్చిగాళ్ల మాయలో పడితే దశాబ్దాల పాటు తెలంగాణ వెనక్కు పోతుందన్న ఆయన.. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

కేసీఆర్ ను జైలుకు పంపుతామని అంటున్నారని.. తెలంగాణను డెవలప్ చేసినందుకేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఘాటు విమర్శలతో చెలరేగుతూ.. ప్రశ్నల వర్షం కురిపించిన కేటీఆర్ కు శనివారం నిర్వహించే సభ ద్వారా అమిత్ షా ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.