Begin typing your search above and press return to search.

ముంద‌స్తు వ‌స్తే మాత్రం అనేక లాభాలు - కేటీఆర్

By:  Tupaki Desk   |   3 Sep 2018 3:55 PM GMT
ముంద‌స్తు వ‌స్తే మాత్రం అనేక లాభాలు - కేటీఆర్
X
టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వహించిన‌ ప్రగతి నివేదిన సభపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ స‌భ‌లో స‌ర్వం తానై వ్య‌వ‌హ‌రించింది తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. త‌న టీంతో హ‌డావుడి చేసిన కేటీఆర్‌ త‌న స‌త్తాను చాటుకునేందుకు జాతీయ మీడియాను పిలిచి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ముందస్తుపై చర్చ లేనే లేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అలాంటి చ‌ర్చ ఉంటే తాను వెల్ల‌డిస్తాన‌ని క‌వ‌ర్ చేశారు. అయితే, ముంద‌స్తు వ‌స్తే మాత్రం అనేక లాభాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. త‌ద్వారా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చుకు కొత్త ట్విస్ట్‌ను జోడించారు.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ గురించి వివ‌రిస్తూ ``నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నాం. ప్రజలతో తిరుగుతున్నాం. ఏళ్ల‌ తరబడి ఉన్న సమస్యలను తీర్చాం. ప్రజల్లో లేని ప్రతిపక్షాలే. ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారు. ఏ ఎన్నికలైనా... ఎన్నికలు ఎప్పుడొచ్చినా... టీఆర్ఎస్‌ 100 అసెంబ్లీ స్థానాలు, 16 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుంటుంది. వివిధ కార‌ణాల వ‌ల్ల కేసీఆర్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో ముంద‌స్తు గురించి వెల్ల‌డించ‌లేదు`` అని మంత్రి కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజలకు టీఆర్ఎస్‌ పాలనపై నమ్మకం ఉందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే సీఎం కేసీఆర్‌ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముంద‌స్తుకు వెళితే అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని పేర్కొంటూ ప్ర‌జ‌ల్లో ఉన్న సానుకూల వాతావ‌ర‌ణాన్ని సొంతం చేసుకునేందుకు ఇదో అవ‌కాశ‌మ‌ని అన్నారు. అదే స‌మయంలో జాతీయ రాజ‌కీయాల్లో కూడా త‌మ ముద్ర‌ను చాటుకునేందుకు స‌రైన రీతిలో స‌మ‌యం కూడా క‌లిసి వ‌స్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ముంద‌స్తు గురించి, శాసనసభ రద్దు చేసే హ‌క్కును కేబినెట్‌ సమావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌ట్ట‌బెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

అధికారంలో ఉన్న తాము ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందామంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పి, నిరూపించుకున్నామని, ఇప్పుడు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు టీఆర్ఎస్‌కే వస్తాయన్నారు. అన్ని స్థానాల్లో తామే విజయం సాధించాలనుకోవడం సరికాదన్నారు. ఎన్నికలన్నా... సభలన్నా టీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని, ప్రజల కోసం రాజీనామాలు చేసిన చరిత్ర మాదేనన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరణించిన చోట కూడా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు గెలుపొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికలు, రాజీనామాలు, అత్యధిక మెజార్టీతో గెలువడం టీఆర్ఎస్‌ పార్టీకి కొత్తమే కాదని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనడం పనికిమాలిన చర్య అని కేటీఆర్ వెల్ల‌డించారు.