Begin typing your search above and press return to search.

కేటీఆర్ స్పీక్స్ : కిష‌న్ రెడ్డికి ఆ ద‌మ్ముందా ?

By:  Tupaki Desk   |   22 Jun 2022 7:38 AM GMT
కేటీఆర్ స్పీక్స్ : కిష‌న్ రెడ్డికి ఆ ద‌మ్ముందా ?
X
రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. దీంతో ఎన్నిక‌ల క‌న్నా ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం క్ష‌ణానికో తీరున ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏమీ ఇవ్వ‌లేద‌న్న వాద‌న‌ను స్థిరం చేసే ప‌నిలో టీఆర్ఎస్ ఉంటోంద‌ని సంబంధిత రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కంటోన్మెంట్ ఏరియాల‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడి ప్రజా బ‌లం పెంచుకోవాల‌న్న‌దే కేటీఆర్ యోచ‌న అని తెలుస్తోంది. ఈ నేప‌థ్యాన కేంద్రంపై మ‌రోసారి నిన్న‌టి వేళ మ‌రోసారి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైద్రాబాద్ లో కైత్లాపూర్ ఆర్ఓబీ ప్రారంభోత్స‌వంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి మంట పుట్టించాయి.

ఐడీపీఎల్ భూముల్లో రోడ్లు వేస్తే కేసులు పెడ‌తామ‌ని కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మీకు చేత‌నైతే నాపై కేసులు పెట్టుకోవాల‌ని సవాల్ చేశారు. కేంద్రంలో ప‌లుకుబ‌డి ఉన్నంత మాత్రాన కష్ట జీవుల‌పై కేసులు పెడ‌తామంటే ఊరుకునేదే లేద‌ని ఆయ‌న అంటున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ ఏరియాల్లో భూములు త‌మ‌కు అప్ప‌గిస్తే అద్భుతంగా ఆర్ఓబీలు, ఫ్లైఓవ‌ర్లు, స్కై వేలు నిర్మించి ఇస్తామ‌ని అంటున్నారు.

ఇంత‌కూ త‌గువుకు కార‌ణం ఏంటి ?

వ‌చ్చే నెల రెండు, మూడు తేదీల్లో హైద్రాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న దృష్ట్యా ఇప్ప‌టి నుంచే టీఆర్ఎస్ వ‌ర్గాలు బీజేపీపై మాట‌ల దాడి పెంచాయి. మోడీ ఏం ముఖంపెట్టుకుని హైద్రాబాద్-కు వ‌స్తార‌ని కేటీఆర్ ప్ర‌శ్నిస్తు న్నారు.అంతేకాదు విభ‌జ‌న చ‌ట్టం మొద‌లుకుని అనేక విష‌యాల్లో తెలంగాణ‌కు బీజేపీ మోసం చేసింద‌నే చెబుతున్నారాయ‌న.

గ‌తం క‌న్నా వేగంగా ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్న దృష్ట్యా కేటీఆర్ వాగ్బాణాలు పెరిగిపోయాయి.వ‌ర‌ద‌లు వస్తే క‌నీసం వెయ్యి కోట్ల రూపాయ‌లు కూడా ఇవ్వ‌లేద‌ని మోడీ ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ కీల‌క ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక పెద్ద రాజ‌కీయ ల‌క్ష్య‌మే ఉంది అని బీజేపీ ప్ర‌తివ్యాఖ్య‌లు చేస్తోంది.

ఎందుకంటే అదే ప‌నిగా త‌మ అధినేత మోడీని టార్గెట్ చేయ‌డంతో ప్ర‌జ‌ల‌లో త‌మ‌పై ఉన్న అసంతృప్తిని తొల‌గించుకునేందుకు ఇదొక మార్గం అవుతుంద‌ని బీజేపీ అంటోంది. తాము తెలుగు రాష్ట్రాల‌కు మంచి ప్రాధాన్యం ఇస్తున్నా అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లే ఎక్కువ‌గా విన‌ప‌డుతున్నాయ‌ని బీజేపీ చెబుతోంది. తాము సంస్థాగ‌తంగా బ‌ల‌పడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఈ క్ర‌మంలోనే రాష్ట్రాల‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇస్తూ నిధులు ఇస్తున్నామ‌ని అంటోంది.

ఇంకా కేటీఆర్ ఏమన్నారంటే..

ఇంధ‌నంపై ప్ర‌త్యేక సెస్సు త‌ద్వారా రాష్ట్రాల‌కు 26 ల‌క్ష‌ల రూపాయ‌ల అద‌న‌పు భారం..ఇదీ బీజేపీ స‌ర్కారు తీరు..అదేవిధంగా మిష‌న్ భ‌గీర‌థ‌కు నిధులు ఇవ్వాలి.. నీతి అయోగ్ చెప్పినా ఇవ్వ‌లేదు. 19వేల కోట్ల రూపాయ‌లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌లేదు.ప్ర‌తి పేద‌వాడికీ ప‌క్కా ఇల్లు ఇస్తామ‌ని చెప్పారు.. ఆ ఊసే లేదు.. రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు వాటి ఊసే లేదు...అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. వీటిపై బీజేపీ ఇంకా స్పందించాల్సి ఉంది.