Begin typing your search above and press return to search.

కోదండ‌రాం విష‌యంలో ఎందుకంత మొహ‌మాటం కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   1 May 2018 5:12 PM GMT
కోదండ‌రాం విష‌యంలో ఎందుకంత మొహ‌మాటం కేటీఆర్‌?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలో జేఏసీ మాజీ చైర్మ‌న్‌, తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్‌ ను గ‌ద్దె దించేందుకే త‌ను పార్టీ ఏర్పాటు చేశాన‌ని పార్టీ ఆవిర్భావ స‌భ వేదిక‌గా కోదండ‌రాం ప్ర‌క‌టించారు. అయితే దీనిపై పార్టీ నేత‌లు ఒక‌రిద్ద‌రు మాట్లాడిన‌ప్ప‌టికీ...ఇప్ప‌టివ‌ర‌కు గులాబీ ద‌ళ‌ప‌తి కుటుంబం నుంచి ఎవ‌రూ స్పందించ‌లేదు. పార్టీ ర‌థ‌సార‌థి సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మ‌క మార్పుల కోసం అంటూ ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో కేటీఆర్ రియాక్ట‌య్యారు. అయితే ఆయ‌న త‌న‌దైన దూకుడుతో స్పందించ‌క‌పోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోసం ప్రజలు ధర్నాలు చేసిన్రని, ప్రభుత్వ చేతిగానితనం వల్ల పవర్‌ హాలీడేలు ప్రకటించార‌ని ఆరోపించారు. పవర్ హాలీడే వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని కేటీఆర్ మండిపడ్డా. కేవలం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నమన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల తీరుపై మండిపడ్డారు. ఎవరెన్ని మాట్లాడినా, తమను దూషించినా పట్టించుకోబోమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను చాలా మంది దూషించారని, లెక్కలేనన్ని కేసీఆర్‌ దిష్టిబొమ్మల్ని దహనం చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో దిష్టిపోయిందనుకున్నామే తప్ప బాధపడలేదన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది అనేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ప్రజల గుండెల్లో నిండి ఉన్న కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఉద్యోగ - కార్మిక - కర్షక పక్షపాతిగా తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టంచేశారు. ప్రజలు ఓపిక, సంయమనంతో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ ఒక్కరోజులోనే రాలేదని, అందుకు 14ఏళ్లు పట్టిందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు.

ఈ సంద‌ర్భంగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జ‌న‌స‌మితి నాయ‌కుడు కోదండ‌రాం తీరును కేటీఆర్‌ త‌ప్పుప‌ట్టారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్ సింగ్ అవుతారా అని ఎద్దేవా చేశారు. గడ్డం పెంచుకున్నోళ్లు, ప్రగతి భవన్ గేట్లు ధ్వంసం చేస్తామన్న వాళ్లు ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. రాజ‌కీయాల్లో విలువ‌ల‌తో ఉండాల‌ని విమ‌ర్శ‌లు స‌హ‌జం అయిన‌ప్ప‌టికీ దానికో ప‌ద్ధ‌తి ఉండాల‌ని సూచించారు. సీఎం కేసీఆర్‌నే కాకుండా త‌మ‌ ఇంట్లో చిన్న పిల్లలను కూడా తిడుతున్నారని ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. కాగా, కోదండ‌రాం పేరు ఎత్త‌కుండానే...విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే..మొహ‌మాట‌మా...లేక త‌మ ప్ర‌త్య‌ర్థి స్థాయి పెంచ‌డం ఇష్ట‌లేక‌పోవ‌డ‌మా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.