Begin typing your search above and press return to search.

లెక్క ఒక్క‌సారి చూసుకోండి కేటీఆర్‌

By:  Tupaki Desk   |   18 Jun 2017 6:52 AM GMT
లెక్క ఒక్క‌సారి చూసుకోండి కేటీఆర్‌
X
వ‌రుస క్ర‌మంలో అన్న చందంగా ఒక్కొక్క కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టిస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌ర్కారును ఒక విష‌యంలో మాత్రం అభినందించాల్సిందే. భ‌విష్య‌త్ మీద భ‌రోసాను.. రానున్న రోజులు మ‌రింత బాగుంటాయ‌న్న భావ‌న‌ను క‌లుగ‌జేయ‌టంలో కేసీఆర్ స‌ర్కారు స‌క్సెస్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చూసినంత‌నే.. విన్నంత‌నే తెలంగాణ‌లో చాలా జ‌రిగిపోతుంద‌న్న భావ‌న‌ను క‌లుగ‌జేయ‌టంలో టీఆర్ ఎస్ నేతృత్వంలోని స‌ర్కారు త‌న‌దైన శైలిలో ముందుకు వెళుతుంద‌ని చెప్పాలి.

వినేవి.. చూసేవి అన్నీ నిజాలు కావ‌ని.. లోతుగా అధ్య‌య‌నం చేస్తే విష‌యాలు అంత‌కంత‌కూ అర్థ‌మ‌వుతాయ‌ని విరుచుకుప‌డుతున్నాయి తెలంగాణ విప‌క్షాలు. కేసీఆర్ స‌ర్కారు ప్ర‌క‌టించే ప్రతి నిర్ణ‌యంలోనూ వ్యూహం ఉంటుంద‌ని.. లోగుట్టు ఉంటుంద‌ని.. విప్పి చూస్తే లెక్క ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

తాజాగా బావా..బావ‌మ‌రుదులు ఇద్ద‌రూ క‌లిసి అట్ట‌హాసంగా ప్రారంభించిన మెడిక‌ల్ డివైజెస్ ప్కారుకు సంబంధించిన భూకేటాయింపుల ముచ్చ‌ట‌పై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అంతా ఓపెన్ గా ఉన్న‌ట్లు క‌నిపించినా.. లోతుగా లెక్క‌ల్లోకి వెళితే.. కొత్త కోణం క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ మండలం సుల్తాన్‌ పూర్‌ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో మెడిక‌ల్ డివైజ‌స్ పార్కును తాజాగా ప్రారంభించారు. తొలి రోజున ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంతో ముగించ‌కుండా.. 14 కంపెనీల‌కు 52 ఎక‌రాల్ని కేటాయించారు. ఈ కేటాయింపుల‌పై వినిపిస్తున్న లెక్క కాస్త సందేహాన్ని క‌లిగించ‌ట‌మే కాదు.. కేటీఆర్ అండ్ కోలు అలెర్ట్ కావాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

ఈ పార్కుతో రూ.50వేల కోట్ల మేర పెట్టుబడులు వ‌స్తాయ‌న్న‌ది అంచ‌నా. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టు కోసం ప్ర‌భుత్వం 250 ఎక‌రాల్ని కేటాయించ‌గా.. ఇందులో 160 ఎక‌రాల స్థ‌లాన్ని మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించ‌నున్నారు. అయితే.. తొలిరోజు 14 కంపెనీల‌కు 52 ఎక‌రాల్ని కేటాయించారు. ఈ 14 కంపెనీలు పెట్టుబ‌డి పెట్టేది రూ.425.29 కోట్లు కావ‌టం గ‌మ‌నార్హం.

భూకేటాయింపుల‌పై వినిపిస్తున్న విమ‌ర్శ‌ల్ని చూస్తే.. 50వేల కోట్ల పెట్టుబ‌డికి 250 ఎక‌రాలు కేటాయించార‌ని అనుకుంటే. ప‌ది వేల కోట్ల పెట్టుబ‌డికి 50 ఎక‌రాల్ని కేటాయించాల్సి ఉంద‌ని..కానీ.. తాజాగా రూ.425 కోట్ల‌కే 52 ఎక‌రాలు ఎలా కేటాయిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ లెక్క‌న ప్ర‌స్తుతం ఉన్న 160 ఎక‌రాలు రూ.1500 కోట్ల పెట్ట‌బ‌డికే పూర్తి కావొచ్చ‌ని..కాదూ కూడ‌దంటే మ‌రో రూ.5వేల కోట్ల‌కు మించి ప్ర‌స్తుతం కేటాయించిన భూమి స‌రిపోదంటున్నారు. లాజిక్ గా చూస్తున్న‌ప్పుడు అవున‌నిపించే ఈ వైనంపై మంత్రి కేటీఆర్ దృష్టి పెడితే.. భ‌విష్య‌త్తులో ఆరోప‌ణ‌లు రాకుండా ఉంటాయ‌న్న సూచ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. దీనిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/