Begin typing your search above and press return to search.

వాటర్‌గ్రిడ్‌ హామీల్ని అటకెక్కిస్తారో ఏంటో?

By:  Tupaki Desk   |   21 Jan 2015 2:30 AM GMT
వాటర్‌గ్రిడ్‌ హామీల్ని అటకెక్కిస్తారో ఏంటో?
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరేలా ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఇంటింటికీ నల్లా వచ్చేలా చేస్తాం అన్నది కూడా ఒకటి. తెలంగాణ పది జిల్లాల వ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయడం ద్వారా... ప్రతి ఇంటికీ తాగునీరు నల్లా ద్వారా సరఫరా అయ్యేలా చేస్తాం అంటూ కేసీఆర్‌ చాలా ఘనంగా హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేయకపోతే గనుక.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ అసలు ప్రజల ముందుకు రానే రానంటూ కేసీఆర్‌ భీషణ ప్రతిజ్ఞ కూడా చేశారు. అయితే తాజాగా కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన- వాటర్‌గ్రిడ్‌ విషయంలో పెడుతున్న మెలికలను గమనిస్తోంటే... ఏదో తేడా కనిపిస్తోంది. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఆచరణసాధ్యం కాదనే సంగతి తెలంగాణ ప్రభుత్వానికి నెమ్మదినెమ్మదిగా బోధపడుతుండగా.. దాన్ని అటకెక్కించే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.

అలాంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే...

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా గడిపారు. తెలంగాణ ప్రభుత్వానికి రకరకాల కేంద్ర సహాయం రాబట్టడం గురించి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. వినతులు సమర్పించారు. అయితే ఉపాధిహామీ నిధుల్లో జాప్యం గురించి చర్చించినప్పుడు సంబంధిత మంత్రి వెంటనే స్పందించారని కేటీఆర్‌ ప్రకటించారు. అదే సమయంలో మరో కీలకాంశం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సంకల్పించిన వాటర్‌గ్రిడ్‌కు అయ్యే ఖర్చులో సగం కేంద్రమే భరించాలని మంత్రి బీరేంద్రసింగ్‌ను కోరినట్లు కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. అయితే ఈ వినతికి సదరు కేంద్రమంత్రిగారి స్పందన ఏంటో మాత్రం కేటీఆర్‌ ముడివిప్పి చెప్పలేదు.

అయితే... ఓట్లకు లింకుపెట్టి మరీ.. వాటర్‌గ్రిడ్‌ చేసేస్తాం అంటూ ప్రకటించుకున్న తెరాస ప్రభుత్వం.. తాము రాజకీయ లబ్ధి పొందడానికి ఉద్దేశించిన ఈ పథకానికి సగం భారం భరించాల్సిందిగా.. భాజపా ప్రభుత్వాన్ని కోరడంలో ఒక మర్మం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెరాస రాజకీయ లాభంతో ముడిపడి ఉన్నది గనుక... పైగా వీరి విజ్ఞప్తిని ఆమోదిస్తే.. ఇదే తరహా ప్రతిపాదనలు అనేక రాష్ట్రాల గురించి వస్తాయి గనుక.. కేంద్రం దీనికి సహకరించే అవకాశం లేదనేది పలువురి అంచనా. అలాంటి నేపథ్యంలో.. కేంద్రంలోని భాజపా సహకరించలేదు గనుక.. మేం ఈ మంచి పనిని చేయలేకపోతున్నాం అంటూ ఇక్కడి రాజకీయ ప్రత్యర్థి భాజపా మీద నెపం పెట్టి కాలం గడిపేయవచ్చుననేది తెరాస సర్కారు వ్యూహంఅని పలువురు అనుమానిస్తున్నారు. అందుకే ఆచరణలో అవకాశం లేని విజ్ఞప్తిని కేంద్రం ఎదుట పెట్టి.. నెపం వారి మీద నెట్టేయడానికి చూస్తున్నట్లుగా కేటీఆర్‌ మాటలున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయినా.. సగం డబ్బు కేంద్రాన్ని భరించమని కోరడం అంటే.. సగం ఓట్లు భాజపాకు, సగం ఓట్లు తెరాసకు వేయమని కేటీఆర్‌ ప్రజలకు చెప్పగలరా? అని కూడా కొందరు భాజపా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి గులాబీ దళాలు ఈ మాటలకు ఏం జవాబు చెబుతాయో ఏంటో?