Begin typing your search above and press return to search.

సీఎం ప‌ద‌వా..నాకు అక్క‌ర్లేదంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   15 Nov 2018 10:15 AM GMT
సీఎం ప‌ద‌వా..నాకు అక్క‌ర్లేదంటున్న కేటీఆర్‌
X
సంక్షేమం - అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందని టీఆర్ ఎస్ పార్టీ నేత‌ - తెలంగాణ రాష్ట్ర అప‌ద్ధ‌ర్మ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమానికి ఇది స్వర్ణయుగమని - నవ తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంతో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. రాష్ట్ర ప్రగతి చక్రం ఆగొద్దంటే పని చేసే ప్రభుత్వం - నాయకుడిని ఆశీర్వదించాలి. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రపంచ మహాసభలు నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ``తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల నీలినీడల నుంచి ఆర్థిక - రాజకీయ స్థిరత్వం సాధించాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్లు ఆశ్చర్య పోయే విధంగా పాలన అందించాం. కేసీఆర్ ఉద్యమకారుడే కాదు.. మంచి పరిపాలకుడిగా నిరూపించుకున్నారు. విభజన సమయంలో లేవనెత్తిన అనుమానాలు.. నాలుగేళ్ల టీఆర్ ఎస్ పాలనలో నివృత్తి అయ్యాయి. తెలంగాణ నాయకులకు పరిపాలన చేయడం చేతకాదు అన్నారు. కానీ తల ఎత్తుకునేలా పరిపాలన చేసి నిరూపించాం`` అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఐటీ రంగంలో దూసుకుపోతున్నామ‌ని, రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రైం రేటు బాగా తగ్గిందని మంత్రి కేటీఆర్ వివ‌రించారు ``రాష్ట్రంలో పేకాట క్లబ్‌ లు లేవు. భూ దందాలు లేవు. హైదరాబాద్‌ లో కర్ఫ్యూ అనేది లేకుండా చేశాం. శాంతి భద్రతలను మెరుగు పరిచాం. న‌వ తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెప్పింది. 16 రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. నేత కార్మికుల ఆత్మ స్థెర్యం పెరిగేలా చేశాం. దివ్యాంగుల సంక్షేమంలోనూ ప్రథమ స్థానంలో నిలిచాం. 2004 నుంచి 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39.04 కోట్లు మాత్రమే. టీఆర్ ఎస్ పాలనలో నాలుగేళ్లలోనే రూ. 2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. భవిష్యత్ తరాల కోసమే మిషన్ భగీరథ - కాకతీయ చేపట్టాం. హైదరాబాద్‌ లో తాగునీటి సరఫరా గణనీయంగా మెరుగైంది. భావితరాలకు కరెంట్ కట్ అనే పదం తెలియకూడదనే ఉద్దేశంతోనే 24 గంటల కరెంట్ సరఫరాకు శ్రీకారం చుట్టాం. 80 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు చేశాం`` అని వివ‌రించారు. ``నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మూడంచెల విధానం అమలు చేశాం. లక్షా 9 వేల ఉద్యోగాలకు గానూ 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. విమర్శకులు సైతం అబ్బురపడేలా ఉద్యోగాల భర్తీ చేపట్టాం. సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. మిగతా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాం`` అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు రాష్ర్టాలతో కయ్యానికి కాలుదువ్వకుండా స్నేహ పూర్వకంగా వ్యవహరించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ``రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాను తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం - పాలమూరు ఎత్తిపోతల ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును 90 శాతానికి పైగా పూర్తి చేశాం. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.``అని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లి కాలంలో త‌న కేంద్రంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వస్తే చాలనే అనుకున్నాను కానీ.. మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. మంత్రి పదవే తనకు ఎక్కువ అనుకుంటా. ఇంతకంటే పెద్ద పదవులు చేపట్టాలన్న దురాశ కూడా లేదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరిక తప్ప తనకు మరో కోరిక లేదన్నారు. కేసీఆర్ వంటి నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ``టీఆర్ ఎస్ పార్టీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. టీఆర్ ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మళ్లీ మీకు కనిపించను. నా సవాల్‌ ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌ కు - ఇతర నేతలకు ఉందా?`` కేటీఆర్ ప్రశ్నించారు.