Begin typing your search above and press return to search.

పూర్వజ‌న్మ పుణ్య‌మే...కేసీఆర్ సీఎం కావ‌డం

By:  Tupaki Desk   |   11 Feb 2018 4:38 AM GMT
పూర్వజ‌న్మ పుణ్య‌మే...కేసీఆర్ సీఎం కావ‌డం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఆయ‌న త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవ‌లి కాలంలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి వంటి నాయ‌కుడు రాష్ట్రంలోనే లేడ‌ని, ఆయ‌న‌కు మ‌రెవ‌రితో పోలిక లేనేలేద‌ని ఇటీవ‌లే వ్యాఖ్యానించిన కేటీఆర్ తాజాగా ఇంకో వ్యాఖ్య చేశారు. కేసీఆర్ వంటి నేత మనకు లభించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు.డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌న కామెంట్ల‌కు త‌గు కార‌ణాలు కూడా కేటీఆర్ వివ‌రించారు.

తెలంగాణ‌ను అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.18 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, ఇది దేశంలో మిగిలిన 28 రాష్ర్టాలన్నీ కలిపి పేదల గృహ నిర్మాణానికి పెడుతున్న ఖర్చుతో సమానమన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పేదలపట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అంటారని, దీన్ని నిజంచేస్తూ సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లికి రూ.75 వేలు ఇస్తున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. కనీసం పెళ్లిలో పప్పన్నం కోసమైనా ఇవి సరిపోతాయన్నారు. పెద్దలకు పెన్షన్లు - ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం - స్కూలు పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం - హాస్టళ్లలో చదివే పిల్లలకు సన్నబియ్యంతోపాటు పుస్తకాలు - దుస్తులు తదితర రూ.లక్షనుంచి లక్షన్నరవరకు అయ్యే ఖర్చును భరిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. పేదల సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని - ఇందులో భాగంగా పుట్టే బిడ్డకు సైతం కేసీఆర్ కిట్ పేరుతో సమకూర్చుతున్నామన్నారు. అడపిల్ల పుడితే రూ.13 వేలు - మగబిడ్డకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తమదేనన్నారు. విద్యుత్ - మంచినీటి సరఫరా - శాంతిభద్రతలు ఎంతో మెరుగయ్యాయన్నారు. కేసీఆర్ వంటి నేత మనకు లభించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం చురుకుగా సాగుతోందని, ఈ ఏడాదంతా వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు తాళంచెవులు అందించి ఇళ్ల‌ను అప్పగిస్తామని మంత్రి కే తారక రామారావు హామీ ఇచ్చారు. దీనికోసం ప్రతినెలా - ప్రతివారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. న‌గరాన్ని స్లమ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పేదలకోసం ఈ ఏడాది లక్ష గృహాలను నిర్మిస్తున్నట్టు గుర్తుచేశారు. ఈ లక్ష గృహాలతో సమస్యలు తీరవని - దశలవారీగా అర్హులైన అందరినీ డబుల్ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని స్పష్టంచేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇండ్లులేనివారి సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్మిస్తున్న ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.