Begin typing your search above and press return to search.

సానియా ప‌ని చేయ‌న‌ట్లేనా కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:09 AM GMT
సానియా ప‌ని చేయ‌న‌ట్లేనా కేటీఆర్‌?
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మూడేళ్ల త‌న తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎంతగా వెలిగిపోతుందన్న విష‌యాన్ని మంత్రి కేటీఆర్ చెప్పినంత అందంగా మ‌రెవ‌రూ చెప్ప‌లేరేమో. కేటీఆర్ మాట‌లు వింటే.. తెలంగాణ రాష్ట్రం ఎక్క‌డికో వెళ్లిపోతున్న‌ట్లుగా ఉండ‌టం ఖాయం. పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంద‌ని చెప్పుకొచ్చారు. అన్నింటికి మించి తెలంగాణ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల గురించి.. తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న అత్యుత్త‌మ విధానాల గురించి పారిశ్రామిక‌వేత్త‌లే దేశ‌విదేశాల్లో ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ‌కు అస‌లైన రాయ‌బారులు పారిశ్రామిక‌వేత్త‌లేన‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశంలోనే అత్య‌ధిక వృద్ధిరేటును సాధించి తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింద‌న్న ఆయ‌న‌.. జీడీపీలోనూ జాతీయ స‌గ‌టు కంటే ఏడు పాయింట్లు అధికంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

టీఎస్ ఐ పాస్ ద్వారా గ‌డిచిన రెండేళ్ల వ్య‌వ‌ధిలో 3800 ప‌రిశ్ర‌మ‌ల‌తో రూ.73 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను సాధించామ‌ని.. 2.6 ల‌క్ష‌ల మందికి ప్ర‌త‌క్ష్యంగానూ.. మ‌రో రూ.8 ల‌క్ష‌ల మందికి ప‌రోక్షంగానూ ఉపాధిని క‌ల్పించిన‌ట్లుగా వెల్ల‌డించారు. తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ వార్షిక నివేదికను విడుద‌ల చేసిన కేటీఆర్ పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం ఎంత‌లా దూసుకు వెళుతుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లి వెళ్లిపోతాయ‌న్న దుష్ప్ర‌చారాన్ని కొంద‌రు చేశార‌ని.. అయితే.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఆ అపోహ‌ల్ని అధిగ‌మిస్తూ ముందుకు వెళ్లిన‌ట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దూసుకెళ్లేలా చేస్తున్న తెలంగాణ స‌ర్కారుకు పారిశ్రామిక‌వేత్త‌లే బ్రాండ్ అంబాసిడ‌ర్లు అయినప్పుడు.. టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను ఎందుకు నిమించిన‌ట్లు? ఆమెకు కోటి రూపాయిల న‌జ‌రానాను ఇవ్వ‌నున్న‌ట్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి.. పారిశ్రామిక‌వేత్త‌లే తెలంగాణ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిన‌ప్పుడు.. తెలంగాణ రాష్ట్రం త‌ర‌ఫున ఎలాంటి ప్ర‌చారాన్ని జ‌ర‌ప‌ని సానియాకు కోటి లెక్క‌న ఇవ్వ‌టం దండ‌గేమో క‌దా కేటీఆర్‌?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/