Begin typing your search above and press return to search.

అవినీతి..ఇప్ప‌ట్లో అంత‌మ‌య్యేది కాదంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:02 PM GMT
అవినీతి..ఇప్ప‌ట్లో అంత‌మ‌య్యేది కాదంటున్న కేటీఆర్‌
X
సామాన్యులు మొదలుకొని మాన్యుల వ‌ర‌కు అంద‌ర్నీ ప‌ట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది అవినీతి ఒక్క‌టే. బ‌ల్ల కింద చేతులు పెట్ట‌నిదే ప‌ని చేయ‌ని ప‌లువురు ప్ర‌భుత్వ ఉద్యోగులు - లంచాల మూట ద‌క్క‌నిదే ప‌నికి ఓకే చెప్ప‌ని కొంద‌రు పాల‌కులు....సొమ్ములు చేతికి అందితేనే గ‌ళం విప్పే రాజ‌కీయ పార్టీలు...ఇలా స‌ర్వం అవినీతిమ‌యం అయిపోయింద‌నే భావ‌న అనేక‌మందిలో ఉంది. ఇంత పెద్ద స‌మస్య‌పై రాజ‌కీయ‌నేత‌ల‌కు ఎంద‌రికో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ అవినీతి స‌మ‌స్య ఇప్ప‌ట్లో పోయేది కాద‌ని అంటున్నారు తెలంగాణ యువ‌మంత్రి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌.

ది హిందూ ప‌త్రిక మాజీ ఎడిట‌ర్ ఎన్‌.రామ్ 'వై స్కామ్స్ ఆర్ హియ‌ర్ టు స్టే' పుస్త‌కాన్ని ర‌చించ‌గా తాజ్ కృష్ణ హోట‌ల్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎల‌క్ష‌న్ ఫండింగ్ ప్ర‌పంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉంద‌న్నారు. కానీ అమెరికా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చు చేసినంత‌గా ఏ దేశ‌మూ ఖ‌ర్చు పెట్ట‌ద‌ని మంత్రి తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా ఎన్నిక‌ల్లో ట్రంప్‌, క్లింట‌న్‌లు బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టార‌న్నారు. ప్ర‌జ‌లు, పెద్ద పెద్ద సంస్థ‌ల నుంచే అగ్ర‌దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు నిధులు అందుతాయ‌న్నారు. కానీ అదంతా లాబీయింగ్ ప‌ద్ధ‌తిలోనే సాగుతుంద‌న్నారు. కానీ భార‌త్‌లో టీఎన్ శేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఎన్నిక‌ల సంఘం త‌న విధిని స‌రిగా నిర్వ‌ర్తించింద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బులో చాలా వ‌ర‌కు అప్ర‌క‌టిత ఆదాయం ఉంద‌న్న విష‌యం వాస్త‌వ‌మే అన్నారు. ఇది అవినీతి, ఇది కాదు అని ఎలా చెప్ప‌గ‌ల‌ర‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

అవినీతిని పూర్తిగా తుడిచేయ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే పనికాద‌ని విశ్లేషించిన మంత్రి కేటీఆర్ అవినీతిని తగ్గించ‌డం మాత్రం సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఇందుకోసం ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం, పాల‌కులు, కృషిచేయాల‌న్నారు. కుంభ‌కోణాల నుంచి భార‌త్ విముక్తి పొందుతున్న ఆశాభావాన్ని కూడా మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేశారు. 2027లో ఎన్‌.రామ్ ఆ పుస్త‌కాన్ని రిలీజ్ చేస్తార‌ని చ‌మ‌త్క‌రించారు. విద్యార్థిగా, ఉద్యోగిగా అమెరికాలో ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను కూడా కేటీఆర్ ఓ ద‌శ‌లో వివ‌రించారు. అమెరికాలో ఉన్న 8 ఏళ్ల‌లో తాను లైసెన్స్ కోసం మాత్ర‌మే ఒక్క‌సారి ప్ర‌భుత్వ అధికారిని క‌ల‌వాల్సి వ‌చ్చింద‌న్నారు. మంచి రోడ్లు, నిరంత‌ర విద్యుత్తు, వేగంగా ప‌నుల జ‌ర‌గాల‌న్న‌దే మ‌న దేశ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, వారి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే రాష్ట్ర ప్ర‌భుత్వం సేవ‌లు అందిస్తోంద‌ని కేటీఆర్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ అవినీతిపై ఎన్‌.రామ్ త‌న‌ అభిప్రాయాల‌ను వినిపించారు. ఎల‌క్ష‌న్ ఫండింగ్‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌డంలో ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌న్నారు. పొలిటిక‌ల్ ఫైనాన్స్ వ‌ల్ల ఏడాదంతా కుంభ‌కోణాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని రామ్ అన్నారు. రాజ‌కీయ పార్టీల‌కు వ‌చ్చే కార్పొరేట్ ఫండింగ్ ఆగ‌డం లేద‌న్నారు. ఇటీవ‌ల పాస్ చేసిన ఫైనాన్స్ బిల్లులో లొస‌గులు ఉన్నాయ‌న్నారు. రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు అంద‌జేసే పెద్ద వ్య‌క్తుల ఐడెంటిటీని గోప్యంగా ఉంచే విధంగా చ‌ట్టాలను త‌యారు చేశార‌న్నారు. చెక్కులు, బాండ్ల ద్వారా వ‌చ్చే నిధుల‌పై పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌ద‌న్నారు. రాజ‌కీయ పార్టీల‌కు కార్పొరేట్ నిధులు ఆగ‌నంత వ‌ర‌కు అవినీతి, కుంభ‌కోణాలు ఆగ‌వ‌న్నారు.