Begin typing your search above and press return to search.

సోద‌రి ఓట‌మిపైన కేటీఆర్ రియాక్ష‌న్ అలా!

By:  Tupaki Desk   |   29 May 2019 4:36 AM GMT
సోద‌రి ఓట‌మిపైన కేటీఆర్ రియాక్ష‌న్ అలా!
X
తెలంగాణలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. కారు.. ప‌ద‌హారు అంటూ చేసిన ప్ర‌చారానికి ప్ర‌జ‌లు క‌నెక్ట్ కాక‌పోవ‌టం స‌రిక‌దా.. దిమ్మ తిరిగేలా ఫ‌లితాన్ని ఇచ్చి గులాబీ నేత‌ల నోట మాట రాలేని ప‌రిస్థితిని తెచ్చారు. ప‌ద‌కొండు సిట్టింగ్ స్థానాల‌కు తొమ్మిదికే ప‌రిమితం కావ‌టం ఒక ఎత్తు అయితే.. ఓడిన స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత క‌మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత ఓట‌మిపాలు కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టివ‌రకూ ఎన్నిక‌ల ఓట‌మిపై మాట్లాడింది లేదు. తాజాగా కేటీఆర్ ఆ బాధ్య‌త తీసుకున్నారు. ఫార్మ‌ల్ ప్రెస్ మీట్ కాకుండా.. చిట్ చాట్ పేరుతో తానేం చెప్పాల‌నుకున్నది చెప్పేశారు. టీఆర్ఎస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు బాగా ప‌ని చేశార‌ని కాకుంటే ఫ‌లితాలే స‌రిగా రాలేవ‌న్నారు.

నిజామాబాద్ లో త‌న సోద‌రి క‌విత ఓట‌మిపై కేటీఆర్ ఆస‌క్తిక‌ర రీతిలో రియాక్ట్ అయ్యారు. క‌విత ఓట‌మిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌.. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఓట‌మితో పోల్చ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో ప్ర‌ధానిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా ఓట‌మిపాల‌య్యార‌న్నారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్ సైతం మొద‌టి ఎన్నిక‌ల్లో ఓడిన వైనాన్ని గుర్తు చేశారు. కాకుంటే.. ఒక‌సారి గెల‌వ‌టం మొద‌ల‌య్యాక కేసీఆర్ ఓడింది లేదు. కానీ.. క‌విత మాత్రం అందుకు భిన్న‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

నిజామాబాద్ లో క‌విత ఓట‌మికి రైతులు కార‌ణం కాద‌ని.. అక్క‌డ నామినేష‌న్లు వేసింది రైతులు కాద‌న్నారు కేటీఆర్. నామినేష‌న్లు వేసిందంతా రాజ‌కీయ కార్య‌క‌ర్త‌లేన‌ని.. జ‌గిత్యాల‌కు చెందిన ఒక కాంగ్రెస్ నేత ఇంట్లోనే 93 నామినేష‌న్లు త‌యార‌య్యాయ‌ని చెప్పారు. నిజామాబాద్ లో కాంగ్రెస్‌.. బీజేపీ కుమ్మ‌క్కు అయ్యింద‌ని.. అందుకే క‌విత ఓడిపోయార‌న్నారు.

టీఆర్ఎస్.. తాను.. క‌విత అనేక డ‌క్కామొక్కీలు తిన్నామ‌ని.. ఒక్క ఓట‌మితోనే తాము కుంగిపోమ‌న్నారు. పోరాట యోధుడి కుమార్తె క‌విత అన్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ఎన్నిక‌ల్లో రాహుల్ ఓడిపోయార‌ని.. అంత మాత్రాన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దుప్ప‌ట్లు క‌ప్పుకొని ఇంట్లో ప‌డుకుంటారా? అని ప్ర‌శ్నించారు. కేటీఆర్ మాట‌ల్లో ఓట‌మి తాలుకు ఇబ్బంది కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు?

టీఆర్ ఎస్ డ‌క్కామొక్కీలు తిన్న పార్టీ అని.. ఎన్నోక్లిష్ట ప‌రిస్థితుల్ని అధిగ‌మించింద‌న్నారు. ఓడినంత మాత్రాన కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌స్థైర్యం దెబ్బ తింటుంద‌న్న‌ది నిజం కాద‌న్న ఆయ‌న‌.. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు అధైర్య‌ప‌డొద్ద‌న్నారు. గ‌తంలో గెలిచిన‌ప్పుడు ఎవ‌రూ కిరిటాలు పెట్ట‌లేద‌న్న కేటీఆర్.. వ‌రుస గెలుపు త‌ర్వాతే కదా.. మామూలు కేటీఆర్ కాస్తా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యింది. ఆ విషయం అంద‌రికి గుర్తున్న‌ప్పుడే కేటీఆర్ ఇలా మాట్లాడ‌టం దేనికి నిద‌ర్శ‌నం? నాన్ స్టాప్ గా గంట మాట్లాడినా.. వేలెత్తి చూపించేందుకు అవ‌కాశం ఇవ్వ‌ని కేటీఆర్.. త‌న తీరుకు భిన్నంగా మాట్లాడిన ప‌ది మాట‌ల్లో నాలుగు మాట‌లు విమ‌ర్శ‌లు చేయ‌టానికి అవ‌కాశం ఇచ్చేలా ఉండ‌టం దేనికి సంకేతం?