Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు ఆ ప‌గ్గాలు అప్ప‌గించేసిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2015 9:31 AM GMT
కేటీఆర్‌ కు ఆ ప‌గ్గాలు అప్ప‌గించేసిన‌ట్లేనా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడు ఎవ‌ర‌న్న విష‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వెంట‌నే.. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ట‌కీమ‌ని స‌మాధానం చెప్పే వారు సైతం ఒక్క‌సారి ఆగుతారు. కేటీఆర్ అని నోటి వెంట మాట వ‌చ్చినా.. అదంత ఈజీనా? అని ప్ర‌శ్నిస్తే మాత్రం కాస్త వెన‌క్కి త‌గ్గుతారు. త‌న రాజ‌కీయ వార‌సుడ్ని కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌కున్నా.. త‌న చేత‌ల ద్వారా ఆయ‌న తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

గ‌తంతో పోలిస్తే.. ఈ మ‌ధ్య కాలంలో కేసీఆర్ కుమారుడు.. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వైఖ‌రిలో చాలానే మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పొచ్చు. మొద‌ట్లో ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా మిగిలిన మంత్రుల మాదిరే వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌కాలంలో తానే అంతా అయిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ మ‌ధ్య టీ హ‌బ్ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా.. ర‌త‌న్ టాటా వ‌స్తే.. ఆ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ గైర్హాజ‌రు అయ్యారు.

అలా అని ఆయ‌న ఏదైనా అతి ముఖ్య‌మైన స‌మావేశంలో ఉన్నారా? అంటే అది లేదు. మెద‌క్ లోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఉన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్ర‌భావితం చేసే అంశానికి సంబంధించిన కార్య‌క్ర‌మానికి కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌టం అంటే.. కొడుకు.. మంత్రి అయిన కేటీఆర్‌ కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లే భావించాలి. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌నాదెళ్ల వ్య‌వ‌హారాన్నే తీసుకుందాం.

ఆయ‌నతో భేటీ అయ్యేందుకు ముఖ్య‌మంత్ర‌లు క్యూ క‌డ‌తారు.కానీ.. ఆయ‌న క‌లుసుకునే విష‌యానికి సంబంధించి కేసీఆర్ పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఆయ‌న సోమ‌వారం టీ హ‌బ్‌ ను సంద‌ర్శించే కార్య‌క్ర‌మానికి సంబంధించి లీడ్ ను కేటీఆరే తీసుకున్నారు. ఇలా.. అత్యంత ముఖ్య‌మైన ప్ర‌ముఖుల్ని రిసీవ్ చేసుకునే విష‌యంలోనూ.. భేటీ అయ్యే విష‌యంలోనూ కేటీఆర్‌ కు అవ‌కాశం ఇస్తున్న తీరు చూస్తే.. త‌న వార‌సుడిగా కేటీఆర్‌ ను ప్ర‌క‌టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్ త‌ర్వాత పార్టీలో ఎవ‌ర‌న్న మాట‌కు.. త‌డ‌బాటు ప‌డే ప‌రిస్థితి ఎక్కువ కాలం ఉండ‌క‌పోవ‌చ్చు.