Begin typing your search above and press return to search.

అమిత్ షా కాదు..భ్ర‌మీషా..ఏసుకున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:19 AM GMT
అమిత్ షా కాదు..భ్ర‌మీషా..ఏసుకున్న కేటీఆర్
X
మాట అన‌ట‌మే కానీ అనిపించుకోవ‌టం బొత్తిగా ఇష్ట‌ప‌డ‌ని పార్టీగా టీఆర్ఎస్ అంద‌రికి సుప‌రిచిత‌మే. త‌మ పార్టీ గురించి.. అధినేత గురించి విమ‌ర్శ‌లు చేసే వారి విష‌యంలో టీఆర్ఎస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్య‌క్షుడి మాట‌ల‌పై విరుచుకుప‌డ్డారు తాజా మాజీ మంత్రి కేటీఆర్‌. త‌మ పార్టీపైనా.. పార్టీ అధినేత పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన అమిత్ షాను కేటీఆర్ త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పోటీ కాంగ్రెస్ పార్టీతోనేన‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్‌. తాము ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డ‌తామే కానీ మోడీకి కాద‌న్నారు. బీజేపీ అంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ కాద‌ని.. భార‌తీయ ఝూటా పార్టీగా అభివ‌ర్ణించారు. టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా క‌ల‌లు కంటున్నారంటూ ఎట‌కారం చేసిన కేటీఆర్‌.. ఆయ‌న అమిత్ షా కాదు.. భ్ర‌మీషా అంటూ ఎద్దేవా చేశారు.

తొమ్మిది నెల‌ల ముందు ఎన్నిక‌ల‌కు వెళుతున్నా.. ప్ర‌జాతీర్పు త‌మ‌కే అనుకూలంగా ఉంటుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. 2002లో గుజ‌రాత్ లో మోడీ.. 2004లో వాజ్ పేయ్ ప్ర‌భుత్వాలు ముంద‌స్తుకు పోలేదా? అంటూ ప్ర‌శ్నించిన కేటీఆర్‌.. మీరు ముంద‌స్తుకు పోతే ఒప్పు.. మేం పోతే త‌ప్పా? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌స్తుతం ఉన్న 5 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలిపించుకోగ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించిన కేటీఆర్‌.. ఒక్క కార్పొరేట‌ర్ ను గెలిపించుకోలేద‌ని బీజేపీ త‌మ‌కు ప్ర‌త్యామ్నాయం ఎలా అవుతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌తో పాటు ఏపీని కూడా క‌లుపుకొని.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను బీజేపీ ద‌గా చేసిన‌ట్లుగా ఫైర్ అయ్యారు.

తెలంగాణ‌లో ఓట్ల‌ను అడిగే నైతిక హ‌క్కు బీజేపీకి ఉండ‌ద‌న్న ఆయ‌న బీజేపీ పాల‌న‌లో బ్యాంకులు అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న‌ట్లుగా చెప్పారు. ఎప్పుడు ఏ బ్యాంకు మూత‌ప‌డుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు చెప్పారు.తెలంగాణ‌లో ఉన్న వారంతా తెలంగాణ బిడ్డ‌లేన‌ని.. అంద‌రిని క‌డుపులో పెట్టుకొని చూసుకున్నామ‌ని చెప్పారు. టీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన‌న్ని అభివృద్ధి ప‌నులు గ‌డిచిన యాభై ఏళ్ల‌లో తెలంగాణ‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పై తాజా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.