Begin typing your search above and press return to search.

తగ్గినట్లే కనిపించి మనసు దోచుకున్నాడే

By:  Tupaki Desk   |   22 Jun 2016 4:13 AM GMT
తగ్గినట్లే కనిపించి మనసు దోచుకున్నాడే
X
ఎంత తీవ్రంగా చెలరేగిపోయి మాట్లాడగలరో.. అంతే స్థాయిలో తగ్గి మాట్లాడేందుకు ఏమాత్రం వెనుకాడరు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఆయనలోని ఈ భిన్న కోణాలు ఆసక్తికరంగా అనిపించినా.. అవసరానికి అనుగుణంగా ఆయన టోన్ లో మార్పు ఇట్టే వచ్చేస్తుంది. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ.. కేంద్రానికి మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చాలా చేశామని కేంద్రం చెప్పటం.. తమకేమీ చేయటం లేదని తెలంగాణ చెప్పటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ప్రకటనలు చేసుకోవటం రెండు వర్గాల మధ్య వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ ఇష్యూను సామరస్యపూర్వకంగా క్లోజ్ చేసేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా నడుం బిగించినట్లుగా చెప్పొచ్చు. తెలంగాణ ఐటీ అభివృద్ధిపై తమకు సమగ్ర నివేదిక అందలేదని కేంద్రమంత్రి గత వారం చెప్పారని.. అందుకే తాము నివేదికతో పాటు.. పలు అంశాల్ని బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకొస్తున్నట్లుగా చెప్పిన కేటీఆర్.. తనదైన వినయ విధేయత అస్త్రాన్ని సంధించారు.

రాజకీయంగా ప్రత్యర్తులైనప్పటికీ.. వయసులో.. హోదాలో పెద్ద వారిని గౌరవించే లక్షణం తమకు చాలా ఎక్కువన్నట్లుగా మాటలు చెప్పటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపించే లక్షణం. అలాంటి వైఖరే తాజాగా కేటీఆర్ మాటల్లోనూ కనిపించటం గమనార్హం. అదెలానంటే.. తాజాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు అంశాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే తాను కలిసినట్లుగా చెబుతూ.. దత్తాత్రేయపై తనకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఐటీ విషయంలో దత్తాత్రేయను అధికారులు తప్పుదోవ పట్టించినట్లుగా చెప్పిన కేటీఆర్.. విమర్శకు విమర్శ సమాధానం కాదని తాను నమ్ముతున్నట్లుగా చెబుతూ.. తనలోని లౌక్యాన్నిప్రదర్శించారు.

కేంద్రంతో తాము పంచాయితీలు పెట్టుకోవటానికి సిద్ధంగా లేమంటూ.. దత్తాత్రేయను ప్రసన్నం చేసుకోవటంతో పాటు.. గడిచిన కొద్ది రోజులుగా కేంద్ర.. రాష్ట్రాల మధ్యన నడుస్తున్న మాటల యుద్ధానికి బ్రేకులు వేయటమే తన ఉద్దేశమని.. అందుకుతామే ఒక అడుగు ముందుకేసినట్లుగా తన తాజా చర్యలతో కేటీఆర్ స్పష్టం చేయటం గమనార్హం. దీనికి నిదర్శనంగా.. విలేకరులు కొందరు బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించి.. కేటీఆర్ ను బ్యాలెన్స్ తప్పేందుకు ప్రయత్నించినా.. ఆయన మాత్రం ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించటం గమనార్హం.

తెలంగాణకు కేంద్రం రూ.85వేల కోట్లు కేటాయించిందంటూ ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని విలేకరులు ప్రస్తావిస్తూ.. దీనికి బదులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చింది రూ.35వేల కోట్లేనని చెప్పారు కదా? అన్న ప్రశ్నకు కూల్ గా రియాక్ట్ అయిన కేటీఆర్.. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంతో పాటు.. రుణాలను కూడా కలిసి చెప్పినట్లుగా ఆచితూచి మాట్లాడటం చూస్తే.. కేటీఆర్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.